కాంగ్రెస్‌కు పీజేఆర్ త‌న‌యుడి రాజీనామా!

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దివంగ‌త పీజేఆర్ త‌న‌యుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ రెండో జాబితాలో ఆయ‌న‌కు చోటు ద‌క్క‌లేదు. దీంతో ఆయ‌న మ‌న‌స్తాపం చెంది, పార్టీని వీడ‌డం చ‌ర్చ‌నీయాంశ మైంది. పీజేఆర్ త‌న‌యుడు…

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దివంగ‌త పీజేఆర్ త‌న‌యుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ రెండో జాబితాలో ఆయ‌న‌కు చోటు ద‌క్క‌లేదు. దీంతో ఆయ‌న మ‌న‌స్తాపం చెంది, పార్టీని వీడ‌డం చ‌ర్చ‌నీయాంశ మైంది. పీజేఆర్ త‌న‌యుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి జూబ్లీహిల్స్ టికెట్‌ను ఆశించారు. అయితే కాంగ్రెస్ ఆలోచ‌న‌లు వేరుగా ఉన్నాయి. క్రికెట‌ర్ అజారుద్దీన్‌కు జూబ్లీహిల్స్ టికెట్‌ను కాంగ్రెస్ కేటాయించింది. ఈ ప‌రిణామాల‌తో విష్ణు షాక్‌కు గుర‌య్యారు. నిజానికి విష్ణు రాజ‌కీయంగా యాక్టీవ్‌గా లేదు. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో మ‌ళ్లీ రాజ‌కీయ తెర‌పైకి వ‌చ్చారు.

కాంగ్రెస్ పార్టీ అనేక స‌ర్వేల త‌ర్వాత విష్ణును కాద‌ని అజారుద్దీన్ వైపు మొగ్గు చూపింది. కాంగ్రెస్‌కు రాజీనామా అనంత‌రం విష్ణు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ త‌న‌కు ఇంత అన్యాయం చేస్తుంద‌ని అనుకోలేద‌న్నారు. ఈవీఎంలో త‌న పేరు చూసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ఇండిపెండెంట్‌గా పోటీలో వుంటాన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఇదిలా  వుండ‌గా పీజేఆర్ త‌న‌య విజ‌యారెడ్డికి ఖైర‌తాబాద్ టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ ఖ‌రారు చేసింది. పీజేఆర్ త‌న‌యుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి కంటే కుమార్తె విజ‌యారెడ్డి తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తోంద‌న్న అభిప్రాయం వుంది. రాజ‌కీయంగా ఆమె క్రియాశీల‌కంగా ఉన్నారు. కొంత కాలం వైసీపీలో విజ‌యారెడ్డి ఉన్నారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా పార్టీ నిర్ణ‌యం తీసుకుంద‌నే కార‌ణంతో ఆ పార్టీని ఆమె వీడారు.

అనంత‌రం బీఆర్ఎస్‌లో చేరారు. హైద‌రాబాద్ మేయ‌ర్ ప‌ద‌విని ఆమె ఆశించారు. ఖైర‌తాబాద్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఆమెకు బీఆర్ఎస్ త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో గ‌త ఏడాది విజ‌యారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. త‌న తండ్రి ప్రాతినిథ్యం వ‌హించిన ఖైర‌తాబాద్ నుంచి టికెట్ ఆశించారు. అందుకు త‌గ్గ‌ట్టు క్షేత్ర‌స్థాయిలో ఆమె వ‌ర్కౌట్ చేసుకున్నారు. విజ‌యారెడ్డి శ్ర‌మ‌ను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ, ఆమెకు టికెట్ ఇచ్చింది. ఇక ప్ర‌జాద‌ర‌ణ ఎలా వుంటుందో చూడాలి.