బోల్తాపడ్డావులే నాయకా!

ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌లు తెలంగాణ‌లో బీజేపీ కొంప కూల్చే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. టీఆర్ఎస్‌కు మోదీ మాటలు ఆయాచిత వ‌ర‌మ‌య్యాయి. దేశ అత్యున్న‌త చ‌ట్ట స‌భ సాక్షిగా మోదీ ఏపీ విభ‌జ‌న‌పై చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ‌లో…

ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌లు తెలంగాణ‌లో బీజేపీ కొంప కూల్చే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. టీఆర్ఎస్‌కు మోదీ మాటలు ఆయాచిత వ‌ర‌మ‌య్యాయి. దేశ అత్యున్న‌త చ‌ట్ట స‌భ సాక్షిగా మోదీ ఏపీ విభ‌జ‌న‌పై చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ‌లో బీజేపీకి శాపంగా మారే అవ‌కాశాలున్నాయి. మోదీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు రానున్న రోజుల్లో బీజేపీకి రాజ‌కీయంగా తీవ్ర న‌ష్టం క‌లిగించే అవకాశం ఉంద‌ని అంటున్నారు.

పార్ల‌మెంట్ సాక్షిగా తెలంగాణ పోరాటాన్ని మ‌రోసారి అవ‌మానించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వెంట‌నే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని మున్సిప‌ల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్ల‌మెంట్‌లో మైకులు ఆపేసి, ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే ఏపీని విభ‌జించారంటూ ప్ర‌ధాని తాజాగా చేసిన విమ‌ర్శ‌లు భూమ్‌రాంగ్ అయ్యాయి. కాంగ్రెస్‌ను టార్గెట్ చేసే క్ర‌మంలో మోదీ వీరావేశానికి లోన‌య్యారు. తానొక‌టి త‌ల‌స్తే, మ‌రొక‌టి అయ్యింది. ఇంకా కాంగ్రెస్ బ‌తికే ఉంద‌ని, దాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌ని ప్ర‌ధాని మోదీ భావించ‌డ‌మే పెద్ద కామెడీ.

తెలంగాణ ఏర్పాటుపై మోదీ విమ‌ర్శ‌లు ఆ రాష్ట్రంలో రాజ‌కీయ చిచ్చు ర‌గిల్చాయి. దీంతో తెలంగాణ బీజేపీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డాల్సి వ‌చ్చింది. ప్ర‌త్య‌ర్థుల రాజ‌కీయ దాడి నుంచి త‌ప్పించుకోవ‌డం తెలంగాణ బీజేపీకి పెద్ద స‌వాల్‌గా మారింది. విశ్వ‌గురు కాదు… విష గురు అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క‌సుమ‌న్ ఘాటు ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ … “మిస్ట‌ర్ ఫ్రైమ్ మినిస్ట‌ర్ … ఇది క‌చ్చితంగా అవ‌మాన‌క‌రం. తెలంగాణ ప్ర‌జ‌ల ద‌శాబ్దాల స్ఫూర్తిదాయ‌క పోరాటాన్ని, త్యాగాల‌ను ప‌దేప‌దే అవమానిస్తున్నారు. ప్ర‌ధాని చేసిన అసంబద్ధ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నా. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నా” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇంత‌టితో కేటీఆర్ ఆగ‌లేదు. ప్రధాని వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా తెలంగాణ వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ శ్రేణుల‌కు కేటీఆర్ పిలుపునివ్వ‌డం మోదీ వ్యాఖ్య‌ల తీవ్ర‌త‌ను తెలియ‌జేస్తోంది. కేటీఆర్ పిలుపునందుకుని టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క్షేత్ర‌స్థాయిలో దూకుడు పెంచాయి. అన్ని మండ‌ల‌, నియోజ‌క వ‌ర్గాల కేంద్రాల్లో బీజేపీ దిష్టిబొమ్మ‌లు ద‌హ‌నం, న‌ల్ల‌జెండాల‌తో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. గ‌త ఏడేళ్లుగా తెలంగాణపై కేంద్రం వివ‌క్ష చూపుతోంద‌ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి బీజేపీని దోషిగా నిల‌బెట్టేందుకు ఇది అద్భుత‌మైన అవ‌కాశంగా టీఆర్ఎస్ ముందుకెళుతోంది.  

తెలంగాణ‌లో ఇప్పుడిప్పుడు పంజుకుంటున్న త‌రుణంలో మోదీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు అడ్డంకిగా మారాయ‌ని ఆ రాష్ట్ర బీజేపీ వాపోతుంది. బీజేపీకి అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతున్న త‌రుణంలో అన‌వ‌స‌రంగా త‌ల బొప్పి క‌ట్టేలా మోదీ వ్యాఖ్య‌లు త‌యారయ్యాయ‌నేది బీజేపీ నేత‌ల ఆవేద‌న‌. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ వ్య‌తిరేకి అనే సంకేతాల్ని మోదీ వ్యాఖ్య‌లు పంపాయ‌ని తెలంగాణ బీజేపీ నేత‌లు త‌ల్ల‌డిల్లుతున్నారు. 

రానున్న రోజుల్లో మోదీ వ్యాఖ్య‌ల‌ను మ‌రింత దూకుడుగా టీఆర్ఎస్ జ‌నాల్లోకి తీసుకెళ్లి, బీజేపీకి న‌ష్టం క‌లిగిస్తుంద‌నే ఆవేద‌న ఆ పార్టీ నేత‌ల్లో ఉంది. అనుకున్నదొకటి.. అయినదొకటి.. బోల్తాపడ్డావులే నాయకా అనే రీతిలో తెలంగాణ‌లో బీజేపీ ప‌రిస్థితి త‌యారైంది. మ‌రీ ముఖ్యంగా అంద‌ర్నీ మాట‌ల‌తో బోల్తా కొట్టిస్తార‌నే పేరున్న మోదీనే, తెలంగాణ విష‌యంలో మాత్రం అందుకు విరుద్ధ‌మైన ప‌రిస్థితిని ఎదుర్కోవ‌డం గ‌మ‌నార్హం.