Advertisement

Advertisement


Home > Politics - Telangana

వారెవ్వా: గులాబీని కాలదన్ని కమలాన్ని ముద్దాడి!

వారెవ్వా: గులాబీని కాలదన్ని కమలాన్ని ముద్దాడి!

‘పిచ్చి పిచ్చి నిర్ణయాలేం తీసుకోవద్దు’ ఈ మాటను కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన శైలిలో అయితే ఎలా పలుకుతారో ఒకసారి ఊహించుకోండి. అంతే సెటైరికల్ గాను, సీరియస్ గానూ కేసీఆర్ అదే మాటలను ఆరూరి రమేష్ కు చెప్పారు! అలాంటిదేమీ లేదని రమేష్ కూడా గులాబీ దళపతికి హామీ ఇచ్చారు.

తాను బిజెపిలో చేరడానికి ప్రయత్నించడం లేదని, వారే తనకు ఫోన్లు చేస్తున్నారని సమర్థించుకున్నారు. భారాస నుంచి టికెట్ ఇచ్చినా వద్దన్నారు.. రెండు రోజుల్లోనే ఆయన బిజెపిలో చేరారు. ఇప్పుడు అదేనియోజకవర్గం నుంచి ఆ పార్టీ టికెట్ దక్కించుకుని బరిలో నిలుస్తున్నారు. ఆరూరి రమేష్ రాజకీయం తెలంగాణలో చిత్రంగా చర్చనీయాంశం అవుతోంది.

భారాసకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కొన్ని రోజుల కిందట పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం ప్రకటించడానికి ప్రెస్ మీట్ కు కూడా సిద్ధం చేసుకున్నారు. సరిగ్గా ప్రెస్ మీట్ లో కూర్చోబోయే సమయానికి భారాస సీనియర్లు ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు అక్కడకు చేరుకుని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దాదాపుగా కిడ్నాప్ చేసినంత పనిచేసి బలవంతంగా తమ వెంట కేసీఆర్ నివాసానికి తీసుకువెళ్లారు. అక్కడ కేసీఆర్, ఆరూరి రమేష్ ను ఆప్యాయంగా పైన చెప్పినట్టుగా మందలించారు.

అక్కడ వరంగల్ నియోజకవర్గ నాయకులతో కేసీఆర్ సమావేశం పెట్టుకుని.. ఆరూరి రమేష్ కు ఎంపీ టికెట్ ఆఫర్ చేశారు. అయినా తాను పార్టీలోనే ఉంటానని, టికెట్ మాత్రం వద్దని రమేష్ తిరస్కరించారు. రమేష్ వద్దన్న తరువాత మాత్రమే కడియం శ్రీహరి కూతురు కావ్యను ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ అదేరోజున ప్రకటించారు. కానీ ఆ తర్వాత రెండు రోజులకే బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

తీరా ఇప్పుడు బిజెపి తమ జాబితాను ప్రకటించిన సమయానికి ఆరూరి రమేష్ కు వరంగల్ నుంచి అభ్యర్థిత్వం దక్కింది. అంటే రమేష్ ముందుగానే బిజెపి లో చేరే విషయం నిర్ణయించుకుని.. కేసీఆర్ ఒత్తిడిపెట్టిన సమయంలో ఏదో మాటలు చెప్పి తప్పించుకున్నారని ఇప్పుడు అర్థమవుతోంది. భారాస పరిస్థితి ఎలా అయిపోయిందంటే.. ఆ పార్టీ తరఫున టికెట్ ఇస్తానన్నా సరే తీసుకునే వారు కరవైపోతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో భాజపాతో కుమ్మక్కు అయి కేసీఆర్ బలహీనమైన అభ్యర్థుల్ని నిలబెడుతున్నదని మల్లు రవి ఆరోపించడంలో అతిశయోక్తి ఏముంది? అని ప్రజలు అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?