Advertisement

Advertisement


Home > Politics - Telangana

టీఆర్ఎస్‌కు ఉప ఎన్నిక భ‌యం!

టీఆర్ఎస్‌కు ఉప ఎన్నిక భ‌యం!

ఒక‌ప్పుడు ఉప ఎన్నిక‌లంటే టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు భ‌య‌మే లేదు. తెలంగాణ కోసం ఆయ‌న ప‌లుమార్లు తన‌తో పాటు టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో రాజీనామా చేయించిన సంద‌ర్భాలున్నాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో టీఆర్ఎస్‌కు ఉప ఎన్నిక భ‌యం ప‌ట్టుకుందా? అంటే... ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది.

ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది మాత్ర‌మే సమ‌యం ఉండ‌డంతో ఉప ఎన్నిక‌ల్లో ఫ‌లితం ఏ మాత్రం తేడా కొట్టినా అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌నే భ‌యం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నేత‌ల్ని వెంటాడుతోంది. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో మునుగోడుకు ఉప ఎన్నిక రావ‌చ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అక్క‌డి నుంచి కాంగ్రెస్ త‌రపున ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో నేడో రేపో చేరుతార‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. బీజేపీలో చేరాక ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే మునుగోడుకు ఉప ఎన్నిక త‌ప్ప‌దు. మునుగోడు ఉప ఎన్నిక జ‌రిగితే... మునిగేదెవ‌రో, తేలేదెవ‌రో అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి అన్ని రకాలుగా బ‌ల‌మైన నాయ‌కుడు. మ‌రోవైపు ఉప ఎన్నిక‌లు తెలంగాణ అధికార పార్టీకి క‌లిసి రావ‌డంతో లేదు.

దుబ్బాక‌, హుజూరాబాద్‌ల‌లో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్ని బీజేపీ ద‌క్కించుకుంది. ఒక్క నాగార్జున‌సాగ‌ర్‌లో మాత్రం టీఆర్ఎస్ గెలుపొంది ప‌రువు నిలుపుకుంది. అందుకే మునుగోడు ఉప ఎన్నిక అంటే టీఆర్ఎస్ భ‌య‌ప‌డ‌డం.

ఒక‌వేళ మునుగోడులో ఉప ఎన్నిక జ‌రిగి, టీఆర్ఎస్ ఓడితే మాత్రం... తెలంగాణ‌లో అధికార మార్పిడికి కౌంట్‌డౌట్ స్టార్ట్ అయ్యిన‌ట్టే అని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బీజేపీకి అనూహ్య‌మైన నైతిక బ‌లం తోడైన‌ట్టే. ఇక కాంగ్రెస్ ప‌రిస్థితి చెప్ప‌డానికి ఏమీ వుండ‌ద‌ని అంటున్నారు. మునుగోడు అనే ఉప ఎన్నిక జ‌రిగితే... అనేక రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌నే చ‌ర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది.

మ‌రోవైపు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని పార్టీలోనే కొన‌సాగేందుకు కాంగ్రెస్ పెద్ద‌లు అన్ని రకాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అధికార‌మే ల‌క్ష్యంగా రాజ‌కీయాలు సాగే కాలంలో అభిమానాలు, బుజ్జ‌గింపులు ప‌ని చేస్తాయ‌నుకోవ‌డం అజ్ఞాన‌మే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?