Advertisement

Advertisement


Home > Politics - Telangana

రాజగోపాల్ రెడ్డికి పదవి ఆశ చూపుతున్న కాంగ్రెస్?

రాజగోపాల్ రెడ్డికి పదవి ఆశ చూపుతున్న కాంగ్రెస్?

తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతే ఎలా? కాంగ్రెస్ ఏమైపోతుందోననే భయం ఆ పార్టీ నాయకులకు పట్టుకుంది. ఎలాగైనా రాజగోపాల్ రెడ్డిని ఆపాలని కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఆయన్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేసి పార్టీ మారాలనే ఆలోచన ఉన్న ఇతర నాయకులకు హెచ్చరిక చేయాలని హైకమాండ్ అనుకుంటున్నట్లు సమాచారం. 

రాజగోపాల్ రెడ్డికి  పార్టీలో ఏదైనా పదవి ఇస్తే పార్టీ మారకుండా ఆగిపోతాడనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే మనుగడ లేకుండా పోతుందేమోనని అధిష్టానం భయపడి పోతోంది.

ఒకవేళ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేసి గెలిస్తే బీజేపీ మరింత బలపడుతుందేమోనని కాంగ్రెస్ నాయకత్వానికి భయం పట్టుకుంది.ఈ  నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. మొన్న భట్టి విక్రమార్క వెళ్లి చర్చలు జరిపారు. ఆ మరునాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కూడా చర్చలు జరిపారు. చివరకు  సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. సమస్య ఉంటే.. మాట్లాడుకుందాం అని, పార్టీని వీడొద్దని కోరుతున్నారు. 

రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేశారు. కానీ ఢిల్లీ వెళ్లేందుకు రాజగోపాల్ రెడ్డి సుముఖంగా లేరని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జీ కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ కాంగ్రెన్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణికం ఠాగూర్ సమావేశంలో పాల్గొన్నారు.

రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకుండా ఉండేందుకు చేయాల్సిన అంశాలపై మాట్లాడారు. పార్టీలో పదవి ఇచ్చే విషయమై కూడా చర్చించారని తెలుస్తోంది. పార్టీ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ను కలిసిన తర్వాత కోమటిరెడ్డి సోదరులను పోగొట్టుకోలేక రాజ్‌గోపాల్‌రెడ్డిని శాంతింపజేసి ఎలాగైనా పార్టీలో కొనసాగించాలని భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోతే దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీ బలోపేతం అవ్వడానికి కారణంగా మారుతుందని ఇరువురు నేతలు అధిష్టానం వద్ద చెప్పినట్లుగా సమాచారం. అయితే ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మౌనం వహించినట్లుగా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి గురించి రేవంత్ పెద్దగా పట్టించుకోవడంలేదని సమాచారం.

రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిగా చేయడం రాజగోపాల్ రెడ్డికి ఇష్టంలేదు. పార్టీని వీడాలని నిర్ణయించుకోడానికి ఉన్న అనేక కారణాల్లో ఇదో కారణం.  ఇటీవల కాలంలో చేరికలతో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని, రాజగోపాల్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నాడు అన్న భావన పలువురు నేతలలో ఉంది. చేరికలతో దూకుడు మీదున్న పార్టీకి రాజగోపాల్ రెడ్డి షాక్ ఇవ్వటం కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి విచారణలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైంది. 

కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నట్లు గతంలో కూడా రాజగోపాల్ చాలాసార్లే ప్రకటించారు. మరి ఇప్పుడు ఈ ప్రయత్నాలు తీవ్రం కావడానికి కారణమేమిటి? ఆయన ఆశించిన బేరసారాలు బీజేపీతో ఇప్పుడు వర్కవుట్ అయ్యాయేమో అనిపిస్తోందని కొందరు అంటున్నారు. రాజగోపాల్ అసలు సమస్య రేవంత్ కు పీసీసీ బాధ్యతలు ఇవ్వటమే. పీసీసీ అద్యక్షుడిగా రేవంత్ కాకుండా తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చుంటే ఇపుడు రాజగోపాల్ బీజేపీలోకి వెళ్ళేవారేనా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?