Advertisement

Advertisement


Home > Politics - Telangana

గతం మర్చిపోయిన గులాబీ బాస్!

గతం మర్చిపోయిన గులాబీ బాస్!

కొందరికి వృద్ధాప్యంలో అల్జీమర్స్ అనే జబ్బు వస్తుంది. అదొస్తే గతం గుర్తు ఉండదు. జ్ఞాపక శక్తి నశిస్తుంది. కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టని స్థితికి వెళతారు. రాజకీయ నాయకుల్లో కొందరికి ఈ జబ్బు నిజంగానే వస్తుంది.

ఒకప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన జార్జి ఫెర్నాండజ్, ప్రధానిగా పనిచేసిన గొప్ప రాజకీయవేత్త అటల్ బిహారీ వాజపేయికి అల్జీమర్స్ వచ్చింది. కానీ ఇప్పటి రాజకీయ నాయకులకు చాలామందికి అల్జీమర్స్ వస్తోంది. అయితే అది నిజమైన వ్యాధి కాదు. అదో రాజకీయ వ్యాధి.

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు. అధికారం పోయాక మరోలా మాట్లాడతారు. సమయానికి తగ్గట్లుగా వ్యవహరిస్తుంటారు. తాము శుద్దపూసలమని నమ్మిస్తుంటారు. పత్తిత్తులమని చెబుతుంటారు. గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ కు ఓడిపోయాక, అధికారం పోయాక రాజకీయ అల్జీమర్స్ వచ్చింది.

అందుకే తాను అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాడో మర్చిపోయాడు. ఇప్పుడు శుద్దపూస మాటలు మాట్లాడుతున్నాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదని పట్టుబట్టి కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి భారీ ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించాడు.

ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలని సంకల్పించుకున్నాడు. ఓ యజ్ఞంలా విపక్ష నాయకులను గులాబీ పార్టీలో చేర్చుకున్నాడు. వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చాడు. కొందరికి ఇంకేవో పదవులు ఇచ్చాడు. ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకున్నాడు.

వీళ్ళనే బీటీ బ్యాచ్ (బంగారు తెలంగాణా బ్యాచ్ ) అంటారు. అయితే అధికారం పోగానే కేసీఆర్ ఈ సంగతి మర్చిపోయాడు. చేవెళ్ల ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండాలన్నాడు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పాడు.

మరి తాను అధికారంలో ఉన్నప్పుడు బలమైన ప్రతిపక్షం ఉండాలని ఎందుకు అనుకోలేదు? వాటిని ఎందుకు నిర్వీర్యం చేశాడు ? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలడా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇతర గులాబీ నాయకులు కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని రోజూ అదే పాట పాడుతున్నారు.

మరి గులాబీ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పుడు నిజాలు చెప్పి అధికారంలోకి వచ్చిందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు నెలలే అయింది. కానీ అప్పుడే తెలంగాణను సర్వ నాశనం చేసినట్లు మాట్లాడుతున్నారు. ప్రజలకు తామే రక్షకులమన్నుట్లు బిల్డప్ ఇస్తున్నారు. త్వరలో తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. ఎలా వస్తారనేది మాత్రం చెప్పడం లేదు. మొత్తం మీద గులాబీ నాయకులు రగిలిపోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?