Advertisement

Advertisement


Home > Politics - Telangana

మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారా?

మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారా?

రాజకీయ నాయకులు ప్రత్యర్థులను దెబ్బ తీయాలంటే అనేక వ్యూహాలు పన్నుతుంటారు.  ఏం మాట్లాడితే, ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తే ప్రజలు రెచ్చిపోతారా అని ఆలోచిస్తుంటారు. ప్రజలకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అవసరాన్ని బట్టి  నాయకులు వాటిని ప్రయోగిస్తుంటారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నాయి బీఆర్ఎస్ అండ్ బీజేపీ. కాకపొతే గులాబీ పార్టీ ఒకింత ఎక్కువగా రెచ్చిపోతోంది. ఎందుకంటే అది అధికారం కోల్పోయింది కాబట్టి. ఆ పార్టీ నాయకులు ఒక విధమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నారు కాబట్టి.

గులాబీ పేరు మార్చుకొని తన పుట్టుకకు కారణమైన తెలంగాణ సెంటిమెంటును కోల్పోయింది. దీంతో తెలంగాణ ప్రజలతో బంధం తెగిపోయిందని విశ్లేషకులు కూడా అంటున్నారు. పేరు మార్పు కారణంగానే అధికారం కోల్పోయామని పార్టీ నాయకులు కూడా గగ్గోలు పెడుతున్నారు.

తెలంగాణ సెంటిమెంటుని ఆయుధంగా చేసుకొనే కేసీఆర్ పదేళ్లు రాజ్యం ఏలాడు. కేసీఆర్ కు లేదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేసేవారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు లేదని తేలిపోయింది. కేసీఆర్ అధికారం కోల్పోవడానికి వేరే కారణాలు ఉన్నాయని అందరికీ తెలుసు.

తాజాగా కేసీఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్స్ ప్లాన్ ప్రకారమే చేశాడనిపిస్తోంది. సాధారణంగా పొలిటీషియన్స్ ప్లాన్ ప్రకారమే విమర్శలు చేస్తుంటారు. రేవంత్ రెడ్డి తెలంగాణను వ్యతిరేకించాడు అని బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి తెర లేపారా? తెలంగాణ వద్దంటూ రేవంత్ గన్ ఎక్కుపెట్టాడని, అలాంటి వ్యక్తి సీఎం కావడం బాధాకరమని హరీష్ రావు అన్నాడు.

ఇది జనాల్లోకి ఎంతవరకు వెళుతుందో చెప్పలేం. ఈ ఒక్క విమర్శతో జనం రేవంత్ ను తెలంగాణ వ్యతిరేకిగా భావిస్తారా? అలా అనుకుంటే తెలంగాణను వ్యతిరేకించిన అనేకమంది నాయకులకు కేసీఆర్ మంత్రి పదవులు, ఇతర పదవులు ఇచ్చాడు. దాన్నేమంటారు?

అధికారంలో ఉన్నన్ని రోజులు రోజూ కేసీఆర్ భజన, తెలంగాణా భజన చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ వ్యతిరేక గళం వినిపించాడు. ఉద్యమం సాగుతున్న సమయంలో తెలంగాణా అక్కరలేదని మాట్లాడాడు. ఈయన ఒక ఉదాహరణ మాత్రమే. కేసీఆర్ పంచన చేరి అందలం ఎక్కిన తెలంగాణా వ్యతిరేకులు చాలామంది ఉన్నారు.

కేసీఆర్ తన అవసరాల కోసం వారిని చేరదీశాడు. చొక్కాలు చింపుకొని ఉద్యమం చేసినవారిని పక్కన పెట్టేశాడు. తెలంగాణ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించిన కోదండరాంను ఎలా ట్రీట్ చేశాడో చూసాం. కేసీఆర్ ఎలా వ్యవహరించాడో హరీష్ రావుకు తెలుసు. కానీ గులాబీ పార్టీ నాయకుడిగా మాట్లాడక తప్పదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?