Advertisement

Advertisement


Home > Politics - Telangana

కోడలిని కాంగ్రెస్‌లోకి పంపుతున్న చంద్రబాబు!

కోడలిని కాంగ్రెస్‌లోకి పంపుతున్న చంద్రబాబు!

చంద్రబాబునాయుడు కుటిల వంకర రాజకీయాలు ఎన్నెన్ని రకాలుగా ఉంటాయో సామాన్య ప్రజలెవ్వరూ ఊహించలేరు కూడా. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే తన పార్టీలోని, తనకు అత్యంత ఆంతరంగిక మిత్రులైన నాయకులు కొందరిని భారతీయ జనతా పార్టీలోకి కోవర్టులుగా పంపినచంద్రబాబునాయుడు రాజకీయ ముందుచూపును ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఇప్పుడు వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఏపీ ఎన్నికల బరిలో ఉన్నారు.

పొరబాటున గెలవడం అంటూ జరిగితే.. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తూ ఉంటారనడంలో సందేహం లేదు. అదే క్రమంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చాలా సక్సెస్ ఫుల్ గా సమాధి కట్టేసిన చంద్రబాబునాయుడు.. అక్కడి తన పార్టీ వారిని నెమ్మది నెమ్మదిగా కాంగ్రెసు పార్టీలోకి ప్రవేశపెడుతున్నారు.

ఇతర చేరికల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. తనకు కోడలు వరుస అయ్యే నాయకురాలు.. తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం-నందమూరి వారసత్వానికి ఏకైక ప్రతినిధిగా ఉన్న నందమూరి సుహాసినిని కూడా ఆయన కాంగ్రెసులోకి ప్రవేశపెడుతున్నట్టుగా కనిపిస్తోంది.

నందమూరి కుటుంబ ప్రతినిధిగా ఏపీ రాజకీయాల్లో బాలకృష్ణ ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి కుటుంబ ప్రాతినిధ్యాన్ని తానేమీ తగ్గించడం లేదని చాటుకోవడానికే అన్నట్టుగా.. హరికృష్ణ కూతురు సుహాసినికి చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కూకట్ పల్లినుంచి పోటీలో నిలబెట్టారు. నిజానికి తెలుగుదేశం పార్టీకి గానీ, ఆ సామాజిక వర్గానికి గానీ అది బలమైన నియోజకవర్గమే. కానీ.. నందమూరి సుహాసిని చంద్రబాబు మాయోపాయాలకు కేవలం పావు అయ్యారంతే.

ఆమెకు టికెట్ ఇచ్చినంత మాత్రాన.. అంతకు చాలా ముందునుంచి చంద్రబాబు కుటిల రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గానీ, కల్యాణ్ రామ్ గానీ.. ఎన్నికల ప్రచారానికి రానేలేదు. అందరూ హరికృష్ణ బిడ్డలే.. అయినా వారు పట్టించుకోలేదు. సొంత అక్క చంద్రబాబు చేతిలో పావు అయిందని బాధపడ్డారే తప్ప.. ఆమెకు అనుకూలంగా ప్రచార బరిలో దిగలేదు. సుహాసిని చాలా దారుణంగా ఓటమి పాలయ్యారు. కానీ అప్పటినుంచి తెలుగుదేశం రాజకీయాల్లో అంతో ఇంతో క్రియాశీలంగానే ఉంటూ వస్తున్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఏర్పడిన తర్వాత.. ఆమెను కాంగ్రెసులోకి పంపడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేసినట్టుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఎటూ తన శిష్యుడే. చంద్రబాబు ఏం చెబితే ఆ పనిచేసేందుకు ఆయన సిద్ధంగా ఉంటారనే ప్రచారం ఉంది. అలా, చంద్రబాబు స్కెచ్ ప్రకారం.. నందమూరి సుహాసిని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు.

ప్రస్తుతానికి మర్యాదపూర్వకంగా కలిసినట్టుగానే చెబుతున్నప్పటికీ.. త్వరలోనే ఆమె పార్టీలో చేరడం జరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. వారెవ్వా.. చంద్రబాబూ.. కాంగ్రెస్ వ్యతిరేకత అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో తెలుగుదేశాన్ని స్థాపించిన ఎన్టీఆర్ భావజాలాన్ని తుంగలో తొక్కేసి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పార్టీని చంపేయడం మాత్రమే కాదు. ఎన్టీఆర్ మనవరాల్ని ఆ పార్టీలోకి పంపడం ద్వారా కూడా చాణక్యం ప్రదర్శిస్తున్నావా? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?