Advertisement

Advertisement


Home > Politics - Telangana

‘అర్జంటుగా వలవేద్దాం’ కమలదళం తొందర!

‘అర్జంటుగా వలవేద్దాం’ కమలదళం తొందర!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా వ్యవధి ఉంది. కానీ రాజకీయం అప్పుడే వేడెక్కిపోయింది. తెరాస ఎప్పటిలాగానే సహజమైన దూకుడు మీద ఉండగా.. రాహుల్ ను తీసుకురావడం ద్వారా కాంగ్రెస్, అమిత్ షాను తీసుకురావడం ద్వారా బీజేపీ కూడా ప్రజల్లో ఒక ఊపు తీసుకురాగలిగాయి. 

తెరాసను మట్టి కరిపించే పనిని ఈ రెండు పార్టీల్లో ఎవరు సమర్థంగా చేయగలరు.. ఆ దిశగా ఏ పార్టీని ప్రజలు నమ్ముతున్నారు. తెరాసను వ్యతిరేకించే వారికి ఫస్ట్ ఆప్షన్ గా ఈ రెండు పార్టీల్లో ఏది కనిపిస్తోంది.. అనేది ఆసక్తికరమైన చర్చే. 

తాజాగా కొన్ని పరిణామాలను గమనిస్తోంటే.. తెరాసను కాదనుకున్న వారికి ఫస్ట్ ఆప్షన్ గా కాంగ్రెస్ కనిపిస్తోందా అనే అభిప్రాయం కలుగుతోంది. టీఆర్ఎస్ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఓసారి ప్రభుత్వ విప్ గా కూడా పనిచేసిన అనుభవం ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కుటుంబం.. టీఆర్ఎస్ ను వీడి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడమే ఇందుకు కారణం! 

నల్లాల ఓదెలు, ఆయన భార్య ప్రస్తుతం మంచిర్యాల జడ్పీ ఛైర్ పర్సన్ భాగ్యలక్ష్మి ఇద్దరూ కూడా టీఆర్ఎస్‌ను వీడారు. రేవంత్ రెడ్డితో కలిసి వారు ఢిల్లీ వెళ్లి సోనియాతో భేటీ అయ్యారు. సోనియా కుమార్తె ప్రియాంక వారిద్దరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానికంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ తో విభేదాలే వీరు పార్టీని వీడడానికి కారణం అని వినిపిస్తోంది. అయితే.. టీఆర్ఎస్ ను వీడడం వరకు ఓకే.. వారు తమ భవిష్యత్తుకోసం కాంగ్రెస్ ను ఎంచుకోవడం బీజేపీకి కంగారు పుట్టిస్తోంది. 

తెలంగాణలో.. టీఆర్ఎస్ ను వ్యతిరేకించే వారికి తమ పార్టీ ఒక్కటే ఏకైక ఆప్షన్ గా కనిపించాలనేది కమలదళం కోరిక. అందుకోసం వారు చాలా ఆరాటపడుతున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో కీలకమైన ఓదెలు దంపతులు కాంగ్రెస్ లో చేరడం వారికి మింగుడు పడడం లేదు. 

టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని ప్రజలను నమ్మించే ప్రయత్నానికి ఇది దెబ్బ అని వారు భయపడుతున్నారు. అర్జంటుగా కాంగ్రెసు నాయకులను ఎవ్వరినైనా ఫిరాయింపజేసి తమ పార్టీలోకి తీసుకురావాలని వ్యూహరచన చేస్తున్నారు. 

ఓదెలుకు దీటైన నాయకులు.. తమ పార్టీలోకి కొత్తగా వచ్చి చేరితే కొంచెం పరువు దక్కుతుందని వారి ఆరాటం. అది కూడా కాంగ్రెస్ నుంచి వస్తే ఇంకా బాగుంటుందని కూడా అనుకుంటున్నారు. నిజానికి తెలంగాణలో బీజేపీ చాలా కాలంగా.. వీలైనంత మంది ఇతర పార్టీ నాయకులను తమతో కలుపుకోవడానికి తమ వంతు ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తక్షణ చేరికలు పరువు సమస్యగా మారడంతో.. వారు ఏం చేస్తారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?