పప్పు అనే పదానికి తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులారిటీ ఉంది. పప్పు అనే ముద్దు పేరు ఎవరికో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాంగోపాల్‌వర్మ సినిమాలో ఈ పప్పు గురించి పాట కూడా ఉంది. పప్పు తినడానికి మాత్రమే కాదు, వినోదాన్ని కూడా పంచుతోంది. పప్పుకున్న పవర్ అలాంటిది మరి.
తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో పప్పు ప్రస్తావన తెచ్చారు. దీంతో ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిన్న పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
అసలే అధికారంలో ఉన్న నేత కావడంతో శుభాకాంక్షలు చెప్పే వాళ్లకు కొదవేం ఉంటుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు చెల్లి కల్వకుంట్ల కవిత ట్విటర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా అన్నతో కలిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు.
చెల్లి శుభాకాంక్షలపై కేటీఆర్ స్పందిస్తూ…”థ్యాంక్స్ పప్పు” అంటూ ధన్యవాదాలు తెలిపారు. కవితను కుటుంబ సభ్యులు ముద్దుగా పప్పు అంటారనే విషయం కేటీఆర్ ట్వీట్‌తో తెలిసొచ్చింది.
కానీ పప్పుపై ఒక యువనేతకున్న పేటెంట్ రీత్యా… కేటీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. కొన్ని కొన్ని పదాలు, పేర్లకు ఆయా వ్యక్తులను బట్టి పాపులారిటీ వస్తుందనేందుకు తాజాగా కేటీఆర్ ట్వీటే నిదర్శనం.