కరోనా ఫస్ట్, సెకెండ్ వేవ్‌లు, ఆ తర్వాత బ్లాక్ ఫంగస్…తాజాగా కొత్త వేరియంట్ ‘లాంబ్డా’ భయపెడుతోంది. కరోనా వైరస్‌లో ఇదో కొత్త రకం వేరియంట్ అని నిపుణులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచాన్ని అప్రమత్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గతంలో ఇలాగే చైనాలో కరోనాతో బాధపడుతుంటే, మన వరకూ రాదులే అని నిర్లక్ష్యంగా ఉండడం వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త రకం వేరియంట్‌పై కూడా అలాంటి నిర్లక్ష్యం ఉండకూదని గత అనుభవాలు హెచ్చరిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇది ‘దృష్టిసారించాల్సిన వైరస్ రకం’ అని ప్రకటించడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థే కాకుండా ఇతరత్రా పరిశోధన సంస్థలు కూడా ఈ వేరియంట్‌పై హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ విస్తరిస్తుండడం, దీని స్పైక్ ప్రొటీన్‌లో ఎల్452క్యూ, ఎఫ్490ఎస్ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో ఇది ‘పరిశోధనలో ఉన్న కరోనా రకం’గా బ్రిటన్‌లోని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) వర్గీకరించింది.
బ్రిటన్‌లో ఇప్పటి వరకూ ఆరు లాంబ్డా కేసులు వెలుగు చూశాయి. గత ఏడాది ఆగస్టులో మొట్టమొదట పెరూలో ఈ రకం వేరియంట్ కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ నుంచి పెరూలో బయటపడిన కొవిడ్ కేసుల్లో ఈ వేరియంట్ వాటా 81 శాతం ఉండటం ఆందోళన కలగించే అంశంగా చెప్పు కోవచ్చు. గత రెండు నెలల్లో ఇది చిలీలో 32 శాతానికి పెరిగింది.
అయితే ఈ వేరియంట్ లక్షణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇది ఏ విధంగా మనిషిపై అటాక్ చేస్తుందనేందుకు స్పష్టత రాలేదు. దీనిపై తాజాగా వేస్తున్న టీకాలు ఏ మాత్రం పని చేస్తాయో తెలియాల్సి వుంది. కానీ స్పైక్ ప్రొటీన్‌లోని కొన్ని ఉత్పరివర్తనల వల్ల ఇది ఉద్ధృతంగా వ్యాపించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు లేకపోలేదు.
ఇంకా దీనిపై లోతైన పరిశోధన చేయాల్సి వుందని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ అప్రమత్తంగా ఉండడం ఒక్కటే మన ముందున్న ఏకైక ఆయుధమని చెప్పక తప్పదు.