ఇప్పుడు తమ్ముడు గుర్తురాలేదా రత్నప్రభా..!

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అనూహ్యంగా తెరపైకొచ్చారు మాజీ ఐఏఎస్ రత్నప్రభ. బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఆమెకు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పూర్తి మద్దతిచ్చారు. అప్పటి వరకూ తమకే టికెట్…

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అనూహ్యంగా తెరపైకొచ్చారు మాజీ ఐఏఎస్ రత్నప్రభ. బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఆమెకు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పూర్తి మద్దతిచ్చారు. అప్పటి వరకూ తమకే టికెట్ కావాలని అడిగి, ఆశాభంగం చెందినా, రత్నప్రభ తరపున ప్రచారం చేశారు, వైసీపీకి సవాళ్లు విసిరారు. 

అంతవరకు అంతా బాగానే ఉంది. తీరా ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. పవన్ ప్రచారం తుస్సుమంది, అసలు సిసలు ప్రతిపక్షం మేమేనంటూ చేసిన హడావిడి మొత్తం గాల్లో కలిసిపోయింది. పవన్ సింగిల్ గా వచ్చినా, బీజేపీతో కలసి వచ్చినా ఫలితం లేదని తేలిపోయింది. వకీల్ సాబ్ సినిమాకి తెగిన టికెట్లన్ని ఓట్లు కూడా బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తెచ్చుకోలేకపోయారు.

తమ్ముడు పవన్ కల్యాణ్..

తిరుపతి ఉప ఎన్నికల్లో రత్నప్రభ, పవన్ కల్యాణ్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. పవన్ ను రత్నప్రభ తన తమ్ముడు అంటూ సంబోధించారు. అక్క విజయం కోసం తమ్ముడు వస్తాడని, తనను గెలిపిస్తాడని టికెట్ వచ్చినరోజు ఆశాభావం వ్యక్తం చేశారు. 

నేరుగా పవన్ ని కలసి ప్రచార పర్వానికి పిలిచి, తమ్ముడు సెంటిమెంట్ ని వర్కవుట్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు తమ్ముడు తమ్ముడే పాలిటిక్స్ పాలిటిక్సే అని నిరూపిస్తున్నారు రత్నప్రభ.

రత్నప్రభకు జ్ఞానోదయం..

గతంలో కొన్నాళ్లు బీజేపీ తరపున పనిచేసినా, తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమితో రత్నప్రభకు పూర్తిగా జ్ఞానోదయం అయింది. అందుకే ఆమె ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. రేపోమాపో వైసీపీ కండువా కప్పుకుంటారని సమాచారం. జగన్ కి కూడా ఆమెపై సాఫ్ట్ కార్నర్ ఉందని అంటున్నారు. ఈ దశలో కనీసం పవన్ కల్యాణ్ అయినా ఆమెను ఆపగలరా, అక్క విజయం కోసం కృషిచేసిన జనసేనాని, బీజేపీ నుంచి జారుకుంటున్న ఆమెను తిరిగి ఈ గట్టునే నిలబెట్టగలరా..? అనేది సందేహమే.

రత్నప్రభను ఆపడం పవన్ కల్యాణ్ పని కాదు, ఆ మాట కొస్తే జనసేన నుంచి ఎవరు వెళ్తామన్నా కనీసం పిలిపించి మాట్లాడే రకం కాదు పవన్ కల్యాణ్. అలాంటిదీ బీజేపీ నుంచి వెళ్లాలనుకుంటున్న రత్నప్రభను ఆపుతారనుకోలేం. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో ఆమె కోసం ప్రచారం చేసి, కష్టపడి, పార్టీ శ్రేణుల్ని ఎన్నికల కోసం సిద్ధం చేసి హడావిడి చేశారు పవన్ కల్యాణ్. ఇప్పుడు పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లకూడదంటే రత్నప్రభ వైసీపీలో చేరకుండా పవన్ ఆపగలగాలి.

రత్నప్రభను ఇప్పుడు ఆపకపోతే భవిష్యత్తులో పవన్ నిలబెట్టే ఏ అభ్యర్థినీ, లేదా పవన్ సపోర్ట్ చేసే ఏ బీజేపీ అభ్యర్థినీ ప్రజలు ఓన్ చేసుకోలేరు. వారి విజయం కోసం పాటుపడలేరు. ఎన్నికల ప్రచారంలో తమ్ముడు పవన్ పేరుని వాడుకున్న రత్నప్రభ, ఎన్నికలైపోయాక, పవన్ పవరేంటో తెలిసొచ్చాక, కూరలో కరివేపాకులా పక్కనపడేసి తనదారి తాను చూసుకుంటున్నారన్నమాట.