కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ vs బీజేపీ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఈ వ్యవహారంలో టీడీపీ ఉనికే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌చార్జ్ భూమా కిశోర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు గోపాలపురం అసాన్‌పై వైసీపీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి ముఖ్య అనుచరులు హత్యాయత్నం చేయడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. దీన్ని బట్టి ఆ రెండు పార్టీల మధ్య ఆళ్లగడ్డలో ఏ స్థాయిలో రాజకీయ వైరం నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు.
ఆళ్లగడ్డలో గంగుల, భూమా కుటుంబాల మధ్య వైరం ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం గంగుల కుటుంబానికి వ్యక్తిగత బలం కంటే వైఎస్ జగన్ రూపంలో నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన అనుచర గణం ఉంది. దీంతో గంగుల కుటుంబం ఆళ్లగడ్డ చాలా బలమైన శక్తిగా అవతరించింది.
భూమా నాగిరెడ్డి, ఆయన భార్య శోభానాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఇక ఆ రెండు కుటుంబాల మధ్య రాజకీయ, ఫ్యాక్షన్ గొడవలకు ఫుల్‌స్టాప్ పడినట్టే అని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో భూమా నాగిరెడ్డి అన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు కిశోర్‌రెడ్డి రాజకీయ ప్రవేశంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చిం దనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిశోర్‌రెడ్డి ఎంపీపీగా పని చేసిన అనుభవం ఉంది.
చెల్లి భూమా అఖిలప్రియతో విభేదించి బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సొంత అన్న కూడా కిశోర్‌రెడ్డితో పాటు బీజేపీలో చేరారు. మరోవైపు భూమా కిశోర్‌రెడ్డి తన చిన్నాన్న లాగే అనుచరులను కాపాడుకునేందుకు ఎందాకైనా సరే అనే రీతిలో గట్టిగా నిలబడుతారనే పేరుంది. ఇటు గంగుల వైపు వెళ్లలేక, అటు అఖిలప్రియతో కలిసి నడవలేని భూమా అనుచరులకు కిశోర్‌రెడ్డి నాయకత్వం పెద్ద భరోసా కల్పిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా ఎమ్మెల్యే బిజేంద్రరెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డిలను నిలదీస్తూ ప్రజలకు చేరువ అయ్యేందుకు కిశోర్‌రెడ్డి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అఖిలప్రియ స్వీయ తప్పిదాలతో రాజకీయంగా ఆళ్లగడ్డలో చాలా బలహీనపడ్డారని, ఇక తమకు తిరుగులేదని భావిస్తున్న తరుణంలో గంగుల కుటుంబానికి మరో ప్రత్యర్థి తయారు కావడం గమనార్హం.
ఆళ్లగడ్డ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ రెండు వార్డుల్లో గెలిస్తే, బీజేపీ కూడా అన్నే సీట్లను గెలుపొందడాన్ని ఈజీగా తీసుకోకూడదు. సోషల్ మీడియా వేదికగా, అలాగే ప్రత్యక్షంగా భూమా కిశోర్‌రెడ్డి కొంత కాలంగా అధికార ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆళ్లగడ్డలో ఇసుక , ఎర్రమన్ను దోపిడీ, లిక్కర్ దందా, మార్కెట్‌యార్డులో రైతుల నుంచి అధిక వసూళ్లు ఇలా పలు అంశాలపై కిశోర్‌రెడ్డి నిలదీస్తుండడం సహజంగానే అధికార పార్టీకి కంటగింపుగా మారింది.
మరోవైపు మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్ భూమా అఖిలప్రియ రోజురోజుకూ నియోజకవర్గంలో ప్రజాదరణ కోల్పోతు న్నారనే అభిప్రాయాలున్నాయి. ఆళ్లగడ్డలో అఖిలప్రియ ప్రభ మిణుకుమిణుకు మంటోందనే అభిప్రాయాలున్నాయి. వ్యక్తిగత పనులు, సమస్యలు…కారణాలు ఏవైనా ఆమె నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. అమ్మానాన్నల మాదిరి కాదబ్బా అనే అభిప్రాయం అఖిలప్రియపై అనుచరుల్లో ఏర్పడింది.
ఆమె తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి అడపాదడపా నియోజక వర్గంలో పర్యటిస్తున్నప్పటికీ, కేడర్‌ను నిలుపుకునే చాకచక్యం, పెద్దరికం లేకపోవడంతో ప్రజల నుంచి అంతగా స్పందన కనిపించడం లేదు. దీంతో భూమా అఖిలప్రియ నాయకత్వం మరుగుల పడిపోతోందని టీడీపీ నాయకత్వం భయపడుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీతో తలపడే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఇన్‌చార్జ్ కిశోర్‌రెడ్డి మాత్రమే కనిపించడం, టీడీపీ అధిష్టానానికి ఆందోళన కలిగిస్తోంది.
భూమా కిశోర్‌రెడ్డిపై మత ఘర్షణలు, రాజద్రోహం కేసులు కూడా నమోదు కావడాన్ని బట్టి, గంగుల కుటుంబంపై ఆయన ఏ విధంగా పోరాటం చేస్తున్నారో తెలుసుకోవచ్చు. మరోవైపు ఆయన సోదరి, మాజీ మంత్రి అఖిలప్రియపై ప్రజాసమస్యలపై కూడా ఇతరత్రా వ్యక్తిగతంగా డ్యామేజీ కలిగించే కేసుల్లో ఇరుక్కోవడంపై ఆళ్లగడ్డలో చర్చ జరుగుతోంది.
తమ కంట్లో నలుసుగా తయా రైన భూమా కిశోర్‌రెడ్డిని భయపెట్టేందుకే, ఆయన ప్రధాన అనుచరుడిపై దాడి జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు (మంగళవారం) బీజేపీ రాష్ట్ర నాయకులు ఆళ్లగడ్డ రానున్నారని సమాచారం. మున్ముందు ఆళ్లగడ్డ రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయో చూడాల్సి వుంది.