హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌ల క‌ల‌క‌లం

క‌రోనా రోగుల‌కు త‌గినంత‌గా ఆక్సిజ‌న్ అందుబాటులో లేక‌పోవ‌డంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసి ఢిల్లీని కాపాడాల‌ని సాక్ష్యాత్తు ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని వేడుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ హైకోర్టు…

క‌రోనా రోగుల‌కు త‌గినంత‌గా ఆక్సిజ‌న్ అందుబాటులో లేక‌పోవ‌డంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసి ఢిల్లీని కాపాడాల‌ని సాక్ష్యాత్తు ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని వేడుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ హైకోర్టు ఘాటు హెచ్చ‌రిక …దేశ రాజ‌ధానిలో ఆక్సిజ‌న్ కొర‌త ఎంత ఆవేద‌న‌, ఆగ్ర‌హం క‌లిగిస్తున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు.

తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన కోవిడ్ రోగుల‌కు ఆక్సిజ‌న్ దొర‌క‌డం లేదంటూ మ‌హారాజా అగ్ర‌సేన్ ఆస్ప‌త్రి హైకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై నేడు విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా హైకోర్టు జ‌స్టిస్ విపిన్ సంఘి, జ‌స్టిస్ రేఖాప‌ల్లిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఈ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.
 
స్థానిక, రాష్ట్ర, కేంద్ర అధికారుల్లో ఎవరైనా ఆక్సిజన్ తరలింపునుగానీ, సరఫరాను గానీ అడ్డుకుంటే ‘ఆ వ్యక్తిని ఉరితీస్తాం’ అంటూ ధ‌ర్మాస‌నం తీవ్ర‌స్థాయిలో హెచ్చరించింది. ఈ హెచ్చ‌రిక దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.  అక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను అడ్డుకునే వారి విషయంలో ఎవరినీ విడిచి పెట్టే ప్రసక్తే లేదని ధ‌ర్మాసనం తీవ్ర హెచ్చ‌రిక చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉండ‌గా ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న అధికారులపై కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలిపి చ‌ర్య‌లు తీసుకునేందుకు స‌హ‌క‌రించాల‌ని ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. 

ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను అడ్డుకోవ‌డంతో వంద‌లాది మంది ప్రాణాలు గాల్లో క‌లిసిపోయేందుకు కార‌కుల‌వుతార‌నే ఆవేద‌న‌తో హైకోర్టు ఆ స్థాయిలో హెచ్చ‌రించింద‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆక్సిజ‌న్‌ను అడ్డుకోవ‌డం అంటే హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌డ‌మే అనే అభిప్రాయంతో కోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసిందంటున్నారు.