రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామికి దేశ అత్యున్నత న్యాయ స్థానంలో భలే విచిత్ర పరిస్థితి ఎదురైంది. తన చానల్ డిబేట్లకు వచ్చే వాళ్లకు కనీస గౌరవం ఇవ్వకుండా ఎగిరెగిరి రంకెలేసే ఆర్నబ్‌కు ఒక రకంగా సుప్రీంకోర్టు తిక్క కుదిర్చిందనే చెప్పాలి. బాంబే హైకోర్టుకు వెళ్లాలని సూచించే సందర్భంలో సుప్రీంకోర్టు చెప్పిన విధానం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్‌పీ) స్కామ్‌కు సంబంధించి పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను బాంబే హైకోర్టులో వేసుకోవాలని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. టీఆర్‌పీ స్కామ్‌లో పోలీస్‌స్టేషన్ ముందు హాజరు కావాలని ముంబై పోలీసులు ఆర్నబ్‌కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఆర్నబ్ పిటిషన్ వేశారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం బాంబే హైకోర్టును ఆశ్రయించాలని ఆర్నబ్‌కు సూచించింది. అంతేకాదు, బాంబే హైకోర్టుపై విశ్వాసం ఉండాలని జస్టిస్ చంద్రచూడ్ హితవు పలికారు.
బాంబేలోని వోర్లీలో రిపబ్లిక్ ఆఫీస్ ఉన్నదని, ఆ ఆఫీస్‌కు దగ్గరలోనే ప్లోరా పౌంటేన్ ప్రాంతంలో హైకోర్టు ఉన్నట్టు సుప్రీంకోర్టు ఒక రకంగా వ్యంగ్య ధోరణిలో చెప్పడం గమనార్హం. దీంతో ఆర్నబ్ షాక్‌కు గురయ్యాడు. సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఆర్నబ్ పిటిషన్‌ను సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే వెనక్కి తీసుకున్నాడు.