ఏపీ సర్కార్ -రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మధ్య రాజకీయ క్రీడ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్‌ను తలపిస్తోంది. ఈ రెండు సంస్థల మధ్య పోరు క్షణక్షణానికి మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది.
ఎత్తుకు పైఎత్తులేస్తూ పరస్పరం ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. ఈ క్రమంలో వద్దన్నా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకంగా పంచాయతీ ఎన్నికలను నాలుగు విడతల్లో నిర్వహించేం దుకు షెడ్యూల్‌ను కూడా ప్రకటించడంతో రాజకీయ క్రీడ రసవత్తరంగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నారని ప్రభుత్వంతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో , ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. దీంతో హైకోర్టు వెలువరించే తీర్పు లేదా ఆదేశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెల కొంది. ఇటీవల విచారణలో భాగంగా వ్యాక్సిన్ ప్రక్రియ స్టార్ట్ అయితే సహకరిస్తామని ఎస్ఈసీ తరపు న్యాయవాది హైకోర్టుకు హామీ ఇవ్వడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
మరో వారంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా మొదలు కానుంది. అంతేకాదు, వ్యాక్సిన్ వేసే విషయమై నేడు ప్రధాని మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రెండో దఫా చర్చలు కూడా జరపనున్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం గమనార్హం. ఈ పరిణామాల మధ్య హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే నరాలు తెగేంత ఉత్కంఠ నెలకుంది.
ఒకవేళ ఎస్ఈసీకి తీర్పు అనుకూలంగా వస్తే …తాము ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించేది లేదని, అవసరమైతే బహిష్కరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించిన నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందోననే చర్చలు సాగుతున్నాయి. పైగా ఇద్దరు కూర్చుని చర్చించుకుని స్థానిక సంస్థల ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచిస్తే … ఎస్ఈసీ మాత్రం ఏకపక్షంగా షెడ్యూల్ ప్రకటించారని ప్రభుత్వం వాదిస్తోంది.
ఒకవేళ హైకోర్టులో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది. కానీ ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అనారోగ్య వాతావరణం నెలకుందని చెప్పక తప్పదు.