దాదాపు రెండు నెలల కిందటి వరకూ జనం మధ్యన కనిపించడానికి ప్రాధాన్యతను ఇచ్చే వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. వారిలో కొందరు మంత్రి పదవులను కూడా లక్ష్యంగా పెట్టుకుని పని చేశారు. రాయలసీమ జిల్లాల్లో అనునిత్యం ప్రజల మధ్యన హడావుడిగా కనిపిస్తూ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ వార్తల్లో నిలిచే వారు.
జనం మధ్యన ఉన్నామన్నట్టుగా జనం దృష్టిలో పడేవారు. అయితే గత కొన్నాళ్లుగా కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో ఎమ్మెల్యేల హడావుడి తగ్గుముఖం పట్టింది. కొందరు ఇళ్లకే పరిమితం కాగా, మరి కొందరు సమీక్షా సమావేశాలు, అధికారులతో మాటా మంతి నిర్వహిస్తూ పరిమితంగానే కనిపిస్తున్నారు.
రాయలసీమ జిల్లాల్లో ఈ రాజకీయ స్తబ్ధత కనిపిస్తూ ఉంది. ముందు నుంచినే ప్రతి పక్ష పార్టీ నేతల హడావుడి లేదు. తెలుగుదేశం పార్టీ నేతలు చాలా కాలంగా కిక్కురుమనడం లేదు. మున్సిపల్ ఎన్నికల సందర్భంలో మాత్రం కాస్త హడావుడి చేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చిత్తయ్యింది. దీంతో జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిష్కరించారు. దాంతో కొందరు టీడీపీ నేతలు రిలీఫ్ ఫీలయ్యారు.
ఒక ఓడినా గెలిచినా గొడవ లేదన్నట్టుగా వ్యవహరించారు. ఒకరిద్దరు నేతలు మాత్రమే పార్టీ అధిష్టానం ఎన్నికలను బహిష్కరించినా అభ్యర్థులు పోటీలో ఉన్నట్టుగా హడావుడి చేశారు. ఇక టీడీపీ నేతలు జనం మధ్యకు వెళ్లిన దాఖలాలు లేక రెండేళ్లు గడిచిపోయాయి.
టీడీపీ తరఫున ముఖ్య నేతలుగా వెలిగిన వారు, కంచుకోటల్లాంటి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారు కూడా అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ప్రజల మధ్యకే కాదు, పార్టీ కార్యకర్తల మధ్యకు కూడా వెళ్లడాన్ని మానేశారు. ఈ విషయంలో స్వయంగా చంద్రబాబు నాయుడే సలహా ఇచ్చారనే ఒక ఆఫ్ ద రికార్డు టాక్ ఉంది. ఇప్పటి నుంచి జనం మధ్యకు వెళ్లవద్దని చంద్రబాబు నాయుడే చెప్పారంటారు.
ఎన్నికకు ఏడాది, రెండేళ్ల ముందు వరకూ ఎవ్వరూ జనం మధ్యకు వెళ్లకూడదని.. గ్యాప్ తీసుకుని వెళితేనే ప్రజలు గుర్తిస్తారంటూ చంద్రబాబు నాయుడే గతంలో పచ్చ పార్టీ నేతలకు సలహా ఇచ్చారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలు అయినా రెండు మూడు నెలలకే ఆ పార్టీ కార్యక్రమాలను మొదలుపెట్టింది.
ఎన్నికలైన రెండు నెలలకే హామీల అమలులో చంద్రబాబు నాయుడు డొల్ల తనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు పెట్టింది. ప్రజల్లోకి వెళ్లింది, నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టింది. అలా ఐదేళ్లు ప్రజల మధ్యనే జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కనిపించారు. అందుకు భిన్నంగా వెళ్తోంది టీడీపీ.
ఇక అధికారంలోకి వచ్చాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొందరు తమ తమ వ్యక్తిగత వ్యాపారాలను, వ్యవహారాలను సెటిల్ చేసుకోవడం మీదే దృష్టి పెట్టారు. దాదాపు ఏడాది వరకూ కార్యకర్తలకు కనిపించని ఎమ్మెల్యేలున్నారు. అదే సమయంలో వ్యక్తిగత వ్యవహారాల కన్నా రాజకీయ ఎదుగుదల, మంత్రి పదవుల మీద దృష్టి పెట్టిన వారు మాత్రం జనం మధ్యకు వెళ్లడానికి, సోషల్ మీడియాలో కనిపించడానికి ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో రెండో వేవ్ కరోనాతో నేతలు ఇళ్లు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.
జిల్లా స్థాయిల్లో కరోనా గురించి ప్రభుత్వం నిర్వహించిన సమీక్షల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కొందరు సలహాలు ఇవ్వగా, మరి కొందరు సలహాలు తీసుకుని వచ్చారు. ఇక బయట తిరిగితే నేతలకు కరోనా భయాలు గట్టిగా ఉన్నట్టున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ లో ప్రజల మధ్యన తిరిగిన నేతలు ఈ రెండో వేవ్ లో మాత్రం స్వీయ రక్షణకు కూడా ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా ఉన్నారు. దీంతో నేతలు కార్యకర్తలకూ, ప్రజలకు బయట కనిపించే అవకాశాలు తగ్గిపోయాయి.
కొద్ది మంది ఎమ్మెల్యేలు మాత్రమే.. ధైర్యంగా బయటకు వస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు సాయంగా నిలిచే కార్యక్రమాలను చేపడుతున్నారు. బహుశా ఆరు నెలల తర్వాత అయినా సీఎం జగన్ నిర్వహించే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ఇలాంటి వారే అర్హులేమో!