ఒకవైపేమో కరోనా మహమ్మారి పరిస్థితులు, మరోవైపు చాన్నాళ్ల తర్వాత వచ్చిన ముహూర్తాలు! అది కూడా కొన్నేళ్లే ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి భాజాలు చాలా సైలెంట్ గా మోగుతున్నాయి. కరోనా పరిస్థితుల్లో కూడా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే.. పరిమిత సంఖ్యలో అతిధులతో, ఎలాంటి హడావుడి లేకుండానే పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
మరీ దగ్గరి బంధువులు, కావాల్సిన వాళ్లు మాత్రమే ఈ పెళ్లిళ్లకు హాజరవుతూ ఉన్నారు. ప్రభుత్వ అనుమతుల ప్రకారం గరిష్టంగా 50 మంది అతిథులతో పెళ్లి వేడుకలు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం అంతకు మించి అనుమతులు ఇచ్చినా.. ప్రజలు మాత్రం పెళ్లిళ్లకు వెళ్లేంత డేర్ నెస్ తో కనిపించడం లేదు. కరోనా నిజంగానే ఇప్పుడు ప్రజలను భయపెడుతోంది.
అనవసర ప్రయాణాలను వారు తగ్గించుకుంటున్నారు. ఫలితంగా పెళ్లిళ్లపై కూడా ఈ ప్రభావం పడుతోంది. ధైర్యంగా పెళ్లిళ్లకు, విందులకు వెళ్లే పరిస్థితి లేదిప్పుడు. గత నెలలో అయినా ప్రజలు ధైర్యం చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అయిన వారి పెళ్లిళ్లకు అయినా పిలవకపోతేనే మేలనే పరిస్థితి వచ్చింది.
ప్రభుత్వం 50 మంది అంటుంటే.. ప్రజలు అటు వైపు పది మంది, ఇటు వైపు పది మంది అంటున్నారు! పెద్ద పెద్ద కల్యాణమండపాలను అద్దెకు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నా.. అతిథులు మాత్రం తక్కువ సంఖ్యలోనే ఉంటున్నారు. కేవలం పెళ్లికి సరైన వేదిక కావాలి కాబట్టి.. పెద్ద పెద్ద కల్యాణమండపాలను అద్దెకు తీసుకుంటున్నారు డబ్బున్న వారు. అదే మధ్యతరగతికి అయితే ఇదే మంచి అవకాశం.
మామూలుగా అయితే.. ఎంత సింపుల్ గా పెళ్లి అన్నా.. ఐదారు లక్షల రూపాయల వరకూ ఖర్చు పెట్టుకునేవి మధ్య తరగతి కుటుంబాలు. అయితే ఇప్పుడు అంత ఖర్చు అవసరమే లేదు. అతిథులు తక్కువ, దీంతో ఊర్లో ఉన్న గుడి దగ్గర కూడా పెళ్లి చేసేసే పరిస్థితి! దీంతో ఈ పరిస్థితుల మధ్యన పెళ్లి చేసే మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లి ఖర్చులు తగ్గుతున్నాయి.
ఇక ఇప్పుడే ఎక్కువ పెళ్లిళ్లు జరగడానికి కూడా ప్రత్యేక కారణం ఇన్నాళ్లూ ముహూర్తాలు లేకపోవడం. 2020 ఆరంభం నుంచి ముహూర్తాలు లేక చాలా పెళ్లిళ్లు వాయిదా పడుతూ వచ్చాయి. మాఘమాసంలో కూడా పెళ్లి ముహూర్తాలు లేకపోయాయి. మే అంటూ చాలా మంది ఎదురుచూపుల్లో ఉంటూ వచ్చారు. తీరా ముహూర్తాల కన్నా ముందే కరోనా సెకెండ్ వేవ్ వచ్చింది. ఇన్నాళ్లూ ఎదురుచూసిన వారు ఇక వేచి చూడలేక సింపుల్ గానే కానిచ్చేస్తున్నారు.