కోవిడ్ మూడో వేవ్ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్ ఫస్ట్, సెకెండ్ వేవ్‌లలో పెద్దవాళ్లు నానాయాతన పడ్డారు, ఇంకా పడుతున్నారు. అయితే మూడో వేవ్ విషయానికి వచ్చే సరికి పిల్లలపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో దశ అనివార్యమైతే 25-30% మంది పిల్లలు దాని బారిన పడతారని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. పిల్లలపై పంజా విసురుతుందనే ఆలోచన భయపెడుతోంది.
మూడో వేవ్ పిల్లలపై పంజా విసురుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సర్కార్ ముందుగానే అప్రమత్తమైంది. ఇందులో భాగంగా టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. తొలి విడతలో 4 శాతం మంది, రెండో దశలో ఇప్పటి వరకు 12% మంది చిన్నారులకు కరోనా సోకినట్టు టాస్క్‌ఫోర్స్ కమిటీ గుర్తించింది. అలాగే వైరస్ సోకిన చిన్నారుల్లో 40% మంది 12-18 ఏళ్ల లోపు వారని గుర్తించింది.
20% మంది రెండేళ్ల లోపు , మిగిలిన వారిలో ఇతర వయస్సుల వారు ఉన్నారు. అయితే కరోనా వచ్చిన వారిలో 12-18 ఏళ్ల మధ్య అధికంగా ఉండడానికి ప్రధాన కారణం పాఠశాలలకు వెళ్లడమేనని ఓ అంచనా. దీంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిం చిన నేపథ్యంలో మూడో వేవ్ నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చని టాస్క్‌ఫోర్స్ భావిస్తోంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది చిన్నారులు వైరస్ బారినపడే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరిలో సుమారు 6000-8000 మంది వరకూ ఐసీయూలో చికిత్స పొందే అవకాశం ఉండవచ్చని లెక్క కడుతున్నారు.
ముఖ్యంగా ఆగస్టులో మూడో వేవ్ ఉధృతి ఉంటుందని వైద్య నిపుణుల అంచనా. ఎందుకంటే వేవ్‌కు వేవ్‌కు మధ్య కనీసం మూడు నెలల సమయం ఉంటుందని గత రెండు వేవ్‌ల అనుభవంతో వైద్య నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. మూడోదశ కనీసం 2-3 నెలల పాటు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే పిల్లలకు వైద్యం అందించే నిపుణులు తగినంత మంది లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాధ్యమైనంత వరకూ మూడో వేవ్ ముప్పునకు గురికాకుండా ఉండటమే ఉత్తమ చర్యగా భావిస్తున్నారు. అందుకే ఎంతో ముందుగానే దేశ వ్యాప్తంగా మూడో వేవ్ నుంచి తప్పించుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.