ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వం గురించి జనం ఏమనుకుంటున్నారు? ఈ విషయం తెలుసుకోవాలంటే సాధారణంగా ఎవరైనా పత్రికలు చూస్తారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన పత్రికల్లో ఒకటి ఎటూ జగన్ సొంత పత్రిక. అది కాక మిగిలిన రెండూ చూస్తుంటే.. ఒక చిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది.
సాధారణంగా రెండేళ్ల వయసున్న పసిపిల్లలు చాలా ముద్దుగా కనిపిస్తారు. అప్పుడప్పుడే వచ్చే మాటలు.. అటూ ఇటూ వేగంగా తీసే పరుగులు.. వాళ్లు చేసే చిన్న చిన్న అల్లరిపనులు.. అన్నీ ఎంతో ఆనందం కలిగిస్తుంటాయి. మంచి బూరెబుగ్గలు, రింగులు తిరిగిన జుట్టు, పాలుగారేట్లుగా ఉండే మేనిఛాయతో ఉంటారు.
వాళ్లను చూడగానే అబ్బా.. ఎంత బాగున్నాడో అని గానీ, ఎంత ముద్దుగా ఉంది బంగారం.. చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనిపిస్తుంది. ఇంటికి వచ్చే చుట్టాలు గానీ, స్నేహితులు గానీ ఎవరైనా సరే వాళ్లను ముద్దుచేయకుండా ఉండలేరు. కానీ, ఆ సమయంలో తల్లిమనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది.
తన చిన్నారికి దిష్టి తగులుతుందేమో, దానివల్ల వాళ్లకు నలతగా అనిపిస్తుందేమోనని భయపడుతుంది. అందుకే.. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు స్నానం చేయించగానే ముందు ఒక దిష్టిచుక్క పెడతారు. కాటుక అరగదీసి.. దాంతో నుదుటి మీద, కణతల మీద గానీ, బుగ్గ మీద గానీ పెద్దగా వృత్తంలా చుడతారు. దానివల్ల చూసేవాళ్లకు పిల్ల అందం కంటే, ముందుగా ఆ దిష్టిచుక్కే కనపడుతుంది. అప్పుడు వాళ్లు పాపకు దిష్టికొట్టరన్నది తల్లి భావన.
గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని రెండు ప్రధాన పత్రికలు కూడా ఇంచుమించుగా తల్లిపాత్రనే పోషిస్తున్నట్లున్నాయి. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ప్రతిరోజూ ఏదో రకంగా తప్పుబట్టాలనే ప్రయత్నం వాటిలో స్పష్టంగా కనపడుతుంది. జాబ్ క్యాలెండర్ రానంతకాలం రాలేదని, వచ్చాక అందులో తక్కువ ఉద్యోగాలున్నాయని అంటారు.
మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, వనరులు తక్కువగా ఉన్నాయనీ వాళ్లే చెబుతారు. పేదలకు నగదు రూపంలో సాయం అందిస్తుంటే.. ‘అమ్మ ఒడి.. నాన్న బుడ్డి’ అంటూ ఎద్దేవా చేస్తారు. పేదలందరికీ ఇళ్లు కట్టించాలని మహోన్నతమైన ఉద్దేశంతో అడుగులు వేస్తున్నా.. అవి సరిపోవంటూ ముందుగానే సన్నాయినొక్కులు నొక్కుతారు.
అసలు వాళ్లకిచ్చిన స్థలాలు ఎక్కడో ఊరవతల కొండలు, గుట్టల్లో ఉన్నాయని కూడా రాసేస్తారు. కానీ మొన్న జరిగిన శంకుస్థాపనల పండుగ చూస్తే.. జనం వెల్లువలా తరలివచ్చారు. ప్రజల్లో కావల్సినంత అభిమానం ఉన్నా.. పత్రికల్లో చూస్తే మాత్రం అసలేమీ జరగట్లేదనే అనిపిస్తుంది.
ఈ విషయం గురించి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ కార్యకర్త ఒకరు విభిన్నంగా స్పందించారు. ‘‘జగన్ ముఖ్యమంత్రి కాక ముందు ఆయన ఎప్పుడు బయటకెళ్లి ఇంటికొచ్చినా.. తల్లి విజయమ్మ ముందుగా దిష్టి తీసేవారు.
తన బిడ్డకు దిష్టి తగలకూడదన్నది ఆమె ఆలోచన. ఇప్పుడా బాధ్యతను ‘ఆ రెండు పత్రికలు’ తీసుకున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక లోపాన్ని ప్రస్తావించడం ద్వారా వాళ్లు ఈ రెండేళ్ల ప్రభుత్వానికి రోజూ ఒక దిష్టిచుక్క పెడుతున్నారు. తద్వారా ఈ ప్రభుత్వానికి ఎంతోకొంత మంచే చేస్తున్నారు.