టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాకు చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ విషయమై ఆమె ఆందోళనగా ఉన్నారు. తనను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు రక్షణ కల్పించాలని కోల్‌కతా సైబర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
షమీ భార్య తరచూ వార్తలకెక్కుతుంటారు. గతంలో షమీతో కుటుంబ తగాదాల కారణంగా ఆమె పేరు బయటి ప్రపంచానికి తెలిసొచ్చింది. తనను వేధిస్తున్నాడని షమీపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరి…విడాకుల వరకు వెళ్లి ఆగింది.
తాజాగా ఆమెపై బెదిరింపులకు ఆయోధ్య కారణమైంది. ఈ నెల 5న ప్రధాని మోడీ ఆయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా హిందువులకు ఆమె అభినందనలు చెప్పడం కొంత మందికి ఆగ్రహం తెప్పించింది. ఒక ముస్లిం మహిళగా ఆమె పాజిటివ్‌గా స్పందించడమే చిక్కులు తెచ్చినట్టుంది.
కొందరు తనను టార్గెట్ చేసి సోషల్‌మీడియాలోనూ, ఫోన్‌లోనూ తనను బయటికి చెప్పుకోలేని రీతిలో తిడుతున్నారని, అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.