ప్రభుత్వాలు తలచుకోవాలేగాని కొన్ని పనులను, నిర్ణయాలను ఎవ్వరూ ఆపలేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను ఆపగలిగారా? తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకోగలిగారా? కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దును ఆపగలిగారా? ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం ఆపగలిగారా? తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘకాలం సమ్మె చేసి ప్రభుత్వం మెడలు వంచగలిగారా? హైకోర్టుకు వెళ్లినా విజయం సాధించగలిగారా? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించగలిగారా?…ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు.
ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు తమకు ఇష్టం లేకపోయినా ప్రజలు అప్పటికప్పుడు ఏమీ చేయలేరు. ఏదైనా చేయదలచుకుంటే ఎన్నికల్లోనే చేయాలి.ఉమ్మడి ఏపీని విభజించిన కాంగ్రెసును ఏపీ ప్రజలు ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టారు. ఒక ఎన్నికల్లో కాదు, రెండు ఎన్నికల్లో దారుణంగా పరాభవించారు.
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును ఇప్పటికిప్పుడు ఆపడం ఎవరి తరమూ కాదు. ఏపీ విభజన సమయంలో మొత్తం రాష్ట్ర ప్రజలు ఒక మాట మీద ఉన్నారు. కాని మూడు రాజధానుల విషయంలో పరిస్థితి అలా లేదు. ఎక్కడికక్కడ విడిపోయారు. అమరావతి నిర్మాణానికి పునాదులు వేసిన టీడీపీలోనే భిన్నాభిప్రాయాలున్నాయి.
విశాఖపట్టణం నాయకులు అక్కడ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను స్వాగతిస్తుండగా, అమరావతి ప్రాంతం ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నేతలు రాజధానిని తరలించవద్దని ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళననూ రాయలసీమ నేతలూ పెద్దగా పట్టించుకోవడంలేదు. మూడు రాజధానులు రాబోతున్నాయంటూ జగన్ అసెంబ్లీలో ప్రకటించినప్పుడే నిర్ణయం జరిగిపోయిందని అనుకోవాలి.
రాష్ట్ర విభజన మీద కూడా ఆనాడు కాంగ్రెసు పార్టీ, యూపీఏ ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాయి. కాని కమిటీల పేరుతో, చర్చల పేరుతో చాలా కాలం కాలక్షేపం చేశాయి. చివరకు తాము అనుకున్నదే చేశాయి. మూడు రాజధానుల విషయమూ అంతే. వైకాపా అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను వికేంద్రీకరించాలనే నిర్ణయం తీసుకుందని ప్రస్తుత పరిణామాలబట్టి అర్థమవుతోంది.
అసెంబ్లీలో చివరి రోజు సీఎం జగన్ మూడు రాజధానులపై ప్రకటన చేయడం, ఆ వెంటనే జిఎన్‌రావు కమిటీ నివేదిక సమర్పించడం చూస్తే ఇది ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పుకోవచ్చు. వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతి అభివృద్ధి జోలికి పోలేదు. నిర్మాణాలన్నీ ఆపేశారు.
ఆ తరువాత ఆగస్టు నుంచే మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని మార్పుపై సంకేతాలిచ్చారు. దీన్ని ఏనాడూ జగన్ కాదనలేదు. క్రమంగా అమరావతిపై దాడి అధికమైంది. మూడు రాజధానుల కథ క్లైమాక్సుకు చేరుకునే దశలో అమరావతి శ్మశానమని, ఎడారి అని వైకాపా మంత్రులు, నేతలు వ్యాఖ్యలు చేశారు. చివరకు అసెంబ్లీలో జగన్ ప్రకటనతో కథ ముగింపుకు వచ్చింది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్టణమని ఆల్రెడీ ఇప్పటికే స్పష్టమైపోయింది.
మంత్రులు, స్పీకర్, విజయసాయిరెడ్డి ప్రకటనలు, ప్రసంగాలు దీన్ని ధ్రువీకరించాయి. కేబినెట్ నిర్ణయం కేవలం లాంఛనమే. తాజాగా సీఎం జగన్ విశాఖకు భారీగా 394.50 కోట్లు విడుదల చేస్తూ జీవోలు ఇప్పించారు. రాజధాని ఏర్పాటు విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా చెప్పారు.
న్యాయ నిపుణులూ ఇదే చెబుతున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ నివేదికను బుట్టదాఖలా చేసి, తన సొంత ఆలోచనలతో అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లే ఈనాడు అమరావతిని కాదని జగన్ విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ఎంచుకున్నారు. ఆనాడు అమరావతికి జగన్ మద్దతు ఇచ్చాడు కదా అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
కాని అభిప్రాయాలు మార్చుకోనివాడు రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు నాయుడు ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు కదా. తన టర్మ్ ముగుస్తున్న దశలో ప్రత్యేక హోదా కోరుతూ బీజేపీతో తెగదెంపులు చేసుకోలేదా? ఆయనకు అభిప్రాయాలు మారినప్పుడు జగన్‌కూ మారతాయి కదా.
జగన్ మూడు రాజధానులంటూ రాష్ట్రంలో కల్లోలం రేపినా నిజానికి అధికారిక రాజధాని ఒక్కటే. అదే విశాఖపట్టణం. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అదే కాబట్టి. హైకోర్టు ఉండే కర్నూలు, అసెంబ్లీ ఉండే అమరావతి రాజధానులు కావు. సో…చంద్రబాబు 'స్వప్న నగరం అమరావతి' ఇక లేనట్లే.