కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు తిరుపతి ఉప పోరులో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోవడానికి చాలా అంశాలు తోడయ్యాయి. మరీ ముఖ్యంగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేయకపోవడంతో ఓటు వేసేందుకు నిరాసక్తత ప్రదర్శించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకాలం ఓటుకు నోటు అలవాటు చేసిన రాజకీయ పార్టీలు ఒక్కసారిగా నీతి సూక్తులు వల్లె వేయడం ఓటర్లలో అసంతృప్తి మిగిల్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ దఫా ఉప పోరులో ఏ ఒక్క పార్టీ ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయకపోవడం సంచలనం కలిగిస్తోంది. ఇది వినడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది.
ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ డబ్బు పంపిణీకి ససేమిరా అనడంతో, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఎగిరి గంతేశాయని చెప్పొచ్చు. తిరుపతి ఉప పోరులో 64.29% పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ తెలిపారు.
తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప పోరులో ఏకంగా 86.80% పోలింగ్ నమోదు కావడం విశేషం. అక్కడ ఓటర్లు పోటెత్తారు. నాగార్జున సాగర్ ఉపపోరుతో పోల్చితే తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలో 79.03% నమోదైంది.
సాధారణంగా ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన కూలీలు, విద్య, ఉద్యోగాల నిమిత్తం పట్టణాలు, నగరాలకు వెళ్లిన ఓటర్లు …ఓటు వేసేందుకు తప్పక వచ్చేవారు. నాయకులు కూడా వారిని రప్పించేందుకు ఖర్చు పెట్టేవారు. కానీ ఈ దఫా తిరుపతి ఉప పోరులో మాత్రం డబ్బు ఖర్చు అమాంతం పడిపోయింది. ఓటుకు నోటు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేందుకు చార్జీలు, ఇతర ఖర్చులకు డబ్బు పంపిణీ ప్రస్తావనే లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో ఎవరి కోసమో తామెందుకు సొంత ఖర్చులు పెట్టుకుని , కూలి, ఇతరత్రా పనులు పోగొట్టుకుని వెళ్లడం టైం వేస్ట్ పనిగా ఓటర్లు భావించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కరోనా సెకెండ్ వేవ్ విజృంభణ కూడా ఓటర్ల నిరాసక్తతకు కారణమైంది. అగ్గికి ఆజ్యం పోసినట్టు …ఓటుకు నోటు ఇవ్వకపోవడంతో పాటు కరోనా, ఎండ తీవ్రత ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పొచ్చు.
రాజకీయ పార్టీలు భయపడ్డంత పని అయ్యింది. ఓటు వేసేందుకు ఓటర్లు నిరాసక్తత ప్రదర్శించడంతో వివిధ పార్టీల నాయకులు నానా తిప్పలు పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లను తీసుకెళ్లడం రాజకీయ నేతలకు తలకు మించిన భారమైంది.
అది కూడా అధికార పార్టీ నేతలు కొంతలో కొంత ఓటర్లను తరలించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆ తర్వాత టీడీపీ కొంచెం మెరుగనిపించింది. మిగిలిన పక్షాలు చేతులెత్తేశాయి. మొత్తానికి తిరుపతి పార్లమెంట్ పరిధిలో భారీగా ఓటింగ్ పడిపోవడానికి …తిలా పాపం తలా పిడికెడు అని చెప్పక తప్పదు.
సొదుం రమణ