తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌రావు మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. దుబ్బాకలో అధికార పార్టీ ఓటమి పాలు కావడంతో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అలాంటి అద్భుతం ఏదైనా జరగొచ్చనే ఆశ, నమ్మకం ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తున్నాయి.
దీంతో ఉప ఎన్నికకు మరో మూడు నాలుగు నెలలు ఉండగానే ప్రతిపక్ష పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తమ అభ్యర్థిని ఖరారు చేయడంతో పాటు అధినేత దిశానిర్దేశం చేశారు.
అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వభావానికి విరుద్ధంగా వ్యవహరించారు. సహజంగా ఎన్నికల బరిలో అభ్యర్థుల ఎంపిక చివరి వరకు చంద్రబాబు తేల్చరు.
కానీ తిరుపతి లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో తలపడేందుకు టీడీపీ చాలా ముందుగానే తమ అభ్యర్థిని ఎంపిక చేసింది. 2019లో పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మినే తిరిగి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు.
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నేతలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ మేరకు తమ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ఎంపిక చేసినట్టు బాబు స్పష్టం చేశారు.
ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పనబాక లక్ష్మి విజయం కోసం పార్టీ శ్రేణులన్నీ కష్టపడి పని చేయాలని కోరారు.