కరోనా విపత్తు నేపథ్యంలో మీడియాకు రెండేళ్ల పాటు అన్ని రకాల ప్రకటనలు నిలిపి వేయాలని ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సూచించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సోనియాగాంధీకి ప్రధానమంత్రి మోడీ రెండు రోజుల క్రితం ఫోన్ చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఈ సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండాలని సోనియాను మోడీ కోరారు.
అలాగే కరోనాను తరిమి కొట్టడానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ మంగళవారం ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధానంగా ఐదు అంశాలను ఆమె ప్రస్తావించారు.
దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రచారాల కోసం ప్రభుత్వం మీడియాకు ఇచ్చే రకాల ప్రకటనలను వెంటనే నిలిపేసి, ఆ డబ్బుల్ని ప్రధానమంత్రి సహాయ నిధి(పీఎం రిలీఫ్ ఫండ్)కి మళ్లించాలని సూచించారు. దానితో పాటు 20 వేల కోట్ల రూపాయల సెంట్రల్ విస్టా బ్యూటిఫికేషన్‌తో పాటు తదితర ప్రాజెక్టుల పనులను నిలిపివేసి ఆ నిధుల్ని కూడా పీఎం రిలీఫ్ ఫండ్‌కు మళ్లించాలని సోనియా విజ్ఞప్తి చేశారు.
బడ్జెట్ వ్యయంలో 30 శాతం కోత విధించమని సలహా ఇచ్చారు. అన్ని రకాల విదేశీ యాత్రలను రద్దు చేసుకోమని చెప్పారు. పీఎం కేర్స్‌కు వచ్చిన నిధులని పీఎం రిలీఫ్ ఫండ్‌కు మళ్లించమని సోనియా సూచించారు. మరి సోనియా సూచనలను ప్రధాని ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారో చూడాలి.