ఒక వైపు కరోనా మహమ్మారితో దేశం అల్లకల్లోలమవుతున్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇంకా అహంకారం తగ్గలేదు. ప్రపంచంలోనే అత్యధిక మంది కరోనా బారిన పడిన దేశంగా అమెరికా రికార్డులకెక్కింది. అంతేకాదు, మరణాల విషయంలోనూ అమెరికా దూసుకుపోతోంది. అయినప్పటికీ ఇతర దేశాలను బెదిరించే మనస్తత్వాన్ని అమెరికా వీడలేదు.
నిన్నటికి నిన్న వైట్‌హౌజ్‌లో అమెరికా అధ్యక్షడు ట్రంప్ మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉంది. భారత్‌ను అతను బెదరించే తీరులో మాట్లాడటం….అమెరికా అహంకారానికి నిదర్శనమని చెప్పొచ్చు.
కరోనా రోగులకు చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్ మెడిసిన్‌ను సరఫరా చేయాలన్న తమ దేశ అభ్యర్థనను భారత్ పరిగణలోకి తీసుకోకపోతే, ఆ దేశంపై అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుందని ట్రంప్ హెచ్చరించడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ట్రంప్ తెరతీశారనే వాదన వినిపిస్తోంది.
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే 3.67 లక్షలకు పైగా పాజిటివ్ కేసులతో పాటు దాదాపు 11వేల మంది వరకు కరోనాతో మృత్యువాత పడ్డారు. గత రెండు వారాలుగా అమెరికాలో ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు దిక్కుతోచలేదు.
అసలు తన దేశంలో ఎన్ని లక్షల మంది చనిపోతారో చెప్పలేనని ఒకవైపు ట్రంప్ పదేపదే చెబుతూ….మరోవైపు మిత్ర దేశమైన భారత్‌ను హెచ్చరించడం ఏంటనే నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తన దేశంలో కరోనా కేసులతో పాటు మరణాలను కట్టడి చేయలేని ట్రంప్, మనల్ని ఏదో చేస్తానని మాట్లాడ్డంలోని ఔచిత్యం ఏమిటని భారతీయులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా ట్రంప్ ప్రగల్భాలు పలకడం మాని తన దేశ ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న, కంటికి కనిపించని కరోనా వైరస్‌పై ప్రతాపం చూపాలని హితవు చెబుతున్నారు. ముందు ఆ పనిలో నిమగ్నం కావాలని భారతీయులు సూచిస్తునం్నారు. కాగా అమెరికా అధ్యక్షుడి విన్నపంపై భారత్ సానుకూల నిర్ణయం తీసుకొంది.