నీడ వేరు నిజం వేరు. మనిషి నీడే అయినంత మాత్రాన మనిషే కానక్కరలేదు. ఒక పక్క కరోనా వచ్చి జనం భయం గుప్పిట్లో చిక్కకుని, ఇళ్లకే పరిమితమై కిందా మీదా అయిపోతుంటే, ప్రభుత్వాన్ని ఎలా అప్రతిష్ట పాలు చేయాలా? ఎలా నాలుగు ఓట్లు తగ్గేలా పన్నాగాలు పన్నాలా? అని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా దాని మద్దతు దారులు కావచ్చు కిందా మీదా అయిపోతున్నారు. లేని పోని విషయాలు సోషల్ మీడియాలో ప్రచారానికి తెస్తున్నారు. అది అసత్యం అని జనం తెలుసుకునేలోగానే వీలయినంత ఎక్కువ మందికి చేర్చి ప్రచారం కానిచ్చేస్తున్నారు. ప్రభుత్వం తేరుకుని, నిజాలు నిగ్గుదీసి మళ్లీ దాన్ని జనాలకు తెలియచేయాల్సి వస్తోంది. ఈలోగా కొంతయినా డ్యామేజ్ జరుగుతుందిగా అది చాలు అనేది ప్రతిపక్ష ఎత్తుగడగా కనిపిస్తోంది.
రెండు రోజుల క్రితం ఒకటే హడావుడి..కేంద్రం డబ్బులు ఇస్తే రాష్ట్రం పంచుతోంది. కానీ కేంద్రం పేరు చెప్పకుండా, రాష్ట్రం ఇచ్చినట్లు బిల్డప్ ఇస్తోందని. గట్టిగా పది ఓట్లు సంపాదించలేని పార్టీలు, ఓడిపోయిన పార్టీల నాయకులు, ఇక పచ్చదళానికి పబ్లిసిటీ ఇవ్వడమే ధ్యేయంగా నడిచే వెబ్, ప్రింట్ మీడియాలు ఇలా ఒకరేమిటి అదే గోల.
సింపుల్ లాజిక్ ఏమిటంటే, కేంద్రం డబ్బులు ఇవ్వాలంటే నేరుగా అక్కౌంట్లలో జమచేసే పద్దతి ఎప్పుడో వచ్చింది. ఈసారి కూడా కేంద్రం అయిదేసి వందల వంతున అలా అక్కౌంట్లలో వేసింది కూడా. రాష్ట్రం ప్రకటించింది వేరు. రాష్ట్రం కాబట్టి నేరుగా ఇవ్వాలా? వలంటరీల ద్వారా ఇవ్వాలా? అన్నది దానికి వున్న అవకాశాన్ని బట్టి వుంటుంది. వలంటీర్ల వ్యవస్థ ద్వారానే అన్నీ జరుగుతున్నాయి. జరిపిస్తున్నారు కాబట్టి అదే చేసారు. అది కేంద్రం డబ్బులు అంటూ గొడవ? అవును ఇంతకీ కేంద్రానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి. మన దగ్గర మనం చేసిన కొనుగోళ్లు, లావాదేవీల ఆధారంగా వచ్చిన జీఎస్టీ ఆదాయమే కదా? అదేదో వేరే ఆదాయం అన్నట్లు కూడా మాట్లాడతారేంటో?
సరే తరువాత మరో ప్రచారం. కాణిపాకం ఆలయంలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసారు అని. ఈ వాట్సప్ సందేశాన్ని షేర్ చేసేవారికి బుర్ర వుండాలి కదా? గుడిలో ఎందుకు ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేస్తారని? గుడి తప్ప కాణిపాకంలో ఇక స్థలమే దొరకలేదా? పైగా ఈ పోస్ట్ లో హిందువుల సెంటిమెంట్ రెచ్చగొట్టే విధంగా మసీదు వదిలేసారు. చర్చి వదిలేసారు. గుడిమాత్రమే దొరికిందా? గుడిలో చెప్పులతో తిరిగేస్తున్నారు అంటూ రాతలు.
కానీ నిజం ఏమిటి? కాణిపాకంలోని ఓ దేవస్థానం సత్రంలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసారు. గుడిలో కాదు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ ఖండించేలోగానే ఆ నకిలీ పోస్ట్ వాట్సాప్ లో తిరిగేసింది.
ఇక మరీ విచిత్రమైన పోస్ట్ ఒకటి వుంది. ఇది వెల్ ప్లాన్డ్. ఓ డాక్టర్ గారు వున్నట్లుండి శివాలు తొక్కారు. అది కూడా హాస్పిటల్ లో మీడియా ముందు. ఆ టైమ్ లో అక్కడ మీడియా ఎందుకు వుందన్నది పక్కన పెట్టండి. ఆయన తన స్థాయి దాటి లోకల్ ఎమ్మెల్యే మీద కూడా మాట్లాడేసారు. గతంలో వున్న ఎమ్మెల్యే మీద ప్రశంసలు కురిపించారు. ఇక్కడే తెలిసిపోవడం లేదా దీని వెనుక రాజకీయం వుందని.
కానీ అంతా వెల్ ప్లాన్డ్ కదా? ఆ విడియోను వైరల్ చేసేసారు. దాన్ని బట్టుకుని రాతలు రాసేసారు. తీరా ఆరా తీస్తే, ఆయన తెలుగుదేశం పార్టీ మనిషి. ఈ విడియో బైట్ ఇవ్వడానికి కాస్త ముందుగానే ఆయన నేరుగా వెళ్లి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని కలిసి వచ్చారని విచారణలో తేలింది. ఇప్పుడు ఆ విషయాన్ని బయటకు తీసి, నిజం నిగ్గు తేల్చారు. సిసి ఫుటేజ్ తో సహా. కానీ ఈలోగా కావాల్సిన డ్యామేజ్ జరుగుతుంది కదా?
ఇలా ఇంకెన్ని ఫేక్ మెసేజ్ లు చూడాల్సి వస్తోందో ఈ కరోనా కాలంలో?