తెలంగాణాకు ప‌సుపు పూసిన కేంద్రం

నిజామాబాద్‌లో ప్ర‌త్యేకంగా ప‌సుపు బోర్డు పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్ర ప్రభుత్వం ఎట్ట‌కేల‌కు తేల్చిచెప్పి త‌న నైజాన్ని చాటుకుంది. దీంతో తెలంగాణాకు కేంద్ర ప్ర‌భుత్వం బాగా ప‌సుపు పూసింద‌ని సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.…

నిజామాబాద్‌లో ప్ర‌త్యేకంగా ప‌సుపు బోర్డు పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్ర ప్రభుత్వం ఎట్ట‌కేల‌కు తేల్చిచెప్పి త‌న నైజాన్ని చాటుకుంది. దీంతో తెలంగాణాకు కేంద్ర ప్ర‌భుత్వం బాగా ప‌సుపు పూసింద‌ని సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. నిజామాబాద్‌లో ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయిస్తాన‌నే హామీతో ఆ పార్ల‌మెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా ధ‌ర్మ‌పురి అర‌వింద్ విజ‌యం సాధించారు.

ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌డంలో మోడీ స‌ర్కార్ త‌న‌కు తానే ఎలా సాటో …ప‌సుపు బోర్డు హామీనే నిద‌ర్శ‌న‌మ‌ని సోష‌ల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ రోజు లోక్‌స‌భ స‌మావేశంలో నిజామాబాద్‌లో ప‌సుపు బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. 

బోర్డు ఏర్పాటుతో వంగడాలపై పరిశోధనలు జరుగుతాయని, త‌ద్వారా పసుపు మార్కెటింగ్‌ మెరుగు పడుతుందని ఆయ‌న కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఎగుమతులు పెరిగే అవకాశాలున్నాయన్నారు.  పసుపు కోసమే ప్రత్యేకంగా బోర్డు పెట్టడం ద్వారా ఎన్నో లాభాలున్నాయని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.

కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ స‌హాయ మంత్రి పురుషోత్తం రూపాలా స్పందిస్తూ …నిజామాబాద్‌లో ప్ర‌త్యేకంగా ప‌సుపు బోర్డు పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పారు.  పసుపు బోర్డు చేయాల్సిన పని సుగంధ ద్రవ్యాల బోర్డు చేస్తుందని.. మరొకటి అవసరం లేదని కేంద్ర‌మంత్రి ప్ర‌భుత్వ‌ ఉద్దేశాన్ని స్ప‌ష్టం చేశారు. సుగంధ ద్రవ్యాల బోర్డుతో అవే లాభాలు కలుగుతున్నప్పుడు మరో బోర్డు ఎందుకని కేంద్ర మంత్రి ఎదురు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.  

ఇదిలా ఉండ‌గా, పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని గ‌తంలో నిజామాబాద్ ఎంపీ అర‌వింద్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే ఎంపీ మాట మార్చి ప్ర‌త్య‌ర్థుల‌పై ఎదురు దాడికి దిగారు. తెలంగాణ రాష్ట్రంలో పసుపుబోర్డు కంటే మెరుగైన స్పైసెస్‌ ఎక్స్‌టెన్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు కేంద్రం స్పష్టం చేసిందన్నారు. రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూర్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు.

ఇప్పడు విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ఆయ‌న ప్రశ్నించారు.  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేసీఆర్‌కు తొత్తుగా మారి ఆయన రాసిచ్చిన లేఖను చదువుతున్నారని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్‌కు లొంగిపోయినట్లే కనిపిస్తోందని విమ‌ర్శించారు.  

పొలిటికల్ హీరో జగన్

అమ‌రావ‌తి రైతులను మరోసారి మోసం చేసిన చంద్రబాబు