ఒక ఆత్మహత్యను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా చిత్రీకరించడానికి ఆఖరికి కొన్ని టీవీ చానళ్ల ప్రతినిధులు రంగంలోకి దిగడం సంచలనమైన అంశం. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి పోషించడానికి ప్రయత్నిస్తున్న రెండు చానళ్ల ప్రతినిధులు ఒక శవాన్ని బేరానికి పెట్టారనే వార్తలు విస్తుపోయేలా చేస్తూ ఉన్నాయి. వీరు ఎంతకైనా తెగించగలరనే విషయం స్పష్టం అవుతోంది.
బాపట్లలో వెలుగుచూసిన వ్యవహారం ఇది. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు.. నలుకుర్తి రమేశ్ అనే ఒక ముప్పై తొమ్మిదేళ్ల వ్యక్తి తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని ఒక తాపీమేస్త్రీగా చిత్రీకరించి, ఇసుక కొరత వల్ల పనులు లేకుండా పోయినందు వల్ల అతడు ఆత్మహత్య చేసుకున్నాడనే రకంగా ప్రచారం చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్లు, రెండు మీడియా వర్గాల వాళ్లు పాట్లు పడ్డారని తెలుస్తోంది. ఈ విషయాన్ని రమేశ్ కుటుంబీకులే బయట పెట్టారు.
చనిపోయిన వ్యక్తి తాపీ మేస్త్రీ అని చెప్పాలని, పనులు లేకుండా పోవడం వల్ల అతడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబితే మీదకు ఐదు లక్షల రూపాయల డబ్బు వస్తుందని టీవీ 5, ఈటీవీ 2 మీడియా ప్రతినిధులు తమకు చెప్పారని రమేశ్ కుటుంబీకులు చెబుతున్నారు. ఆ ఐదు లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం పరిహారం ఇస్తే వచ్చేవేనట! ఇప్పటికే ఈటీవీ, టీవీ ఫైవ్ లు జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకతను రేకెత్తించడానికి ఎంతగా ప్రయత్నిస్తూ ఉంటాయో వాటిని చూసిన వారు చెబుతారు.
ఇలాంటి నేపథ్యంలో రమేశ్ కుటుంబీకులు చెబుతున్న విషయాలు సంచలనంలా ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. శవాన్ని బేరం ఆడినట్టున్నారు రెండు చానళ్ల వాళ్లు. తాము చెప్పినట్టుగా చెబితే ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయలు అందుతాయని మృతుడి కుటుంబ సభ్యులను ప్రలోభ పెట్టిన వైనం తెలుగు మీడియా పోకడలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అయ్యేలా చేస్తూ ఉన్నాయి. బాధిత కుటుంబీకులు టీవీ 5, ఈటీవీ 2 ప్రతినిధులు అని స్పష్టంగా చెప్పడంతో..అసలు గుట్టు బయటపడింది.