వైఎస్ జగన్ ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గరు. తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తారు. కానీ ఓ విషయంలో మాత్రం మంత్రులంతా కట్టకట్టుకుని వెళ్లి జగన్ ని ఒప్పించారు. ముందు ఆయన ససేమిరా అన్నా తర్వాత ఒప్పుకోక తప్పలేదు. అందుకే ఈ బడ్జెట్ లో రెండు పథకాలకు జగన్ పేరు ముందు వచ్చిచేరింది.
సహజంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల పేర్లన్నీ వైఎస్ఆర్ పేరుతో మొదలవుతాయని అంచనాలున్నాయి. అలాగే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ పింఛన్ భరోసా అంటూ పథకాలను మార్చారు, వాటికి ఓ సమగ్ర రూపం తెచ్చారు, కేటాయింపులు పెంచారు. అమ్మఒడి అని కొత్తగా నవరత్నాల హామీలతో ప్రవేశ పెడుతున్న పథకం పూర్తిగా జగన్ ఆలోచన నుంచి వచ్చినదే. ప్రజా సంకల్ప యాత్రలో.. కూలీనాలీ చేసుకుంటూ పిల్లల్ని బడికి పంపే తల్లిదండ్రుల కష్టాలు తెలుసుకున్నారు జగన్.
ఆర్థిక సాయం అందితే తప్ప తల్లిదండ్రులకు ఊరట ఉండదని, అలా జరిగితేనే పిల్లలు కుటుంబ పోషణలో భాగంగా పనులకి వెళ్లకుండా స్వేచ్ఛగా చదువుకుంటారని ఆలోచించారు. అలా పుట్టిందే అమ్మఒడి. అందుకే జగనన్న అమ్మఒడి అని ఈ పథకానికి పేరు పెట్టాలని మంత్రులు నిర్ణయించారు. జగన్ దగ్గర ఈ ప్రస్తావన తెచ్చినా వద్దన్నారు. అయినా సరే బలవంతంగా ఒప్పించామని అందుకే ఈ పథకానికి జగనన్న అమ్మఒడి అని పేరు పెట్టామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. ఈమాట విన్న వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలంతా హర్షధ్వానాలు చేసి సంతోషాన్ని తెలిపారు. జగనన్న అమ్మఒడికి ఈ బడ్జెట్ లో 6,455 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఇక జగనన్న విద్యాదీవెన మరొకటి. ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకూ వీరిలో కొంతమందికి స్కాలర్ షిప్ అందుతుండేది. ఇకపై అలా కాకుండా ఏకమొత్తం 20వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తం తల్లులకే చెందేలా పథకం రూపొందించారు. అంటే స్కాలర్ షిప్ సొమ్ముకి అదనంగా ఇస్తున్న విద్యా దీవెన డబ్బు.. దుబారా కాకుండా నేరుగా తల్లులకే అందుతుందన్నమాట. జగనన్న విద్యా దీవెన కోసం మొత్తం 1810 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఈ రెండు పథకాలకు జగన్ పేరు పెట్టడానికి మంత్రుల తలప్రాణం తోకకొచ్చినంత పనైంది. ఓ పట్టాన జగన్ ఒప్పుకోకపోయినా ఆయనను బలవంతంగా ఒప్పించారు మంత్రులు. అలా తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ పేరిట రెండు పథకాలు ఆవిష్కృతమయ్యాయి.
సందీప్ చెప్పినట్లే సినిమా ఉందా? అపజయాల నుంచి బయటపడేనా?