భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. భారతీయ జనతా పార్టీ ప్రవచించేది నకిలీ హిందుత్వ వాదం అని ఉద్దవ్ అన్నారు. రామమందిర నిర్మాణం మాత్రమే హిందుత్వవాదం కాదని, రాముడి జాడలో నడవడం అసలైన హిందుత్వ వాదం అవుతుందని ఉద్దవ్ అన్నారు.
భారతీయ జనతా పార్టీ కి, శివసేనకు మహారాష్ట్ర వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పీఠం కోసం ఇరు పార్టీలూ పోటీ పడి, కలిసి పోటీ చేసి కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. చివరకు బీజేపీ తనకున్న అవకాశాలను ఉపయోగించుకుని అక్కడ రాష్ట్రపతి పాలనను తీసుకొచ్చింది.
కనీసం ఆరు నెలల పాటు అక్కడ ప్రెసిడెంట్ రూల్ కొనసాగే అవకాశం ఉంది. అలాకాకుండా ప్రభుత్వం ఏర్పడటానికి అనువైన పరిస్థితులు ఉన్నాయనుకుంటే.. ఎప్పుడైనా రాష్ట్రపతి పాలనను ఎత్తేయవచ్చు. బీజేపీ ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. తమ ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశం ఉన్నప్పుడే అక్కడ ప్రెసిడెంట్ రూల్ ను ఎత్తేయవచ్చు.
శివసేనను దారికి తెచ్చుకోవడమా లేక కాంగ్రెస్, ఎన్సీపీలను చీల్చే అవకాశమా..ఇలాంటి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకోవచ్చు. అంత వరకూ అసెంబ్లీకి సుప్తచేతనావస్థ తప్పకపోవచ్చు. అయితే శివసేన మాత్రం ప్రస్తుతానికి బీజేపీ మీద ఫైర్ అవుతూ ఉంది!