ఏప్రిల్ నెలలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో బాగా సతమతం అయిన దేశాల్లో ఒకటి యూనైటెడ్ కింగ్ డమ్. బ్రిటన్ ప్రధానికి కూడా అప్పుడు కరోనా సోకింది. ఆయన ఐసీయూ వరకూ వెళ్లి, కోలుకున్నారు. ఇప్పుడు కరోనాపై పూర్తి స్థాయిలో విజయం సాధిస్తున్న దేశంగా నిలుస్తూ ఉంది యూకే.
యూకే పరిధిలో మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షల ఎనభై వేలకు పైనే చేరింది. అయితే వారిలో చాలా మంది కోలుకున్నారు. ప్రస్తుతం యూకే పరిధిలో రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. ఒక దశలో కరోనా విజృంభణతో బ్రిటన్ ఏమైపోతుందో అనే ఆందోళన రేగింది. లండన్ లో అయితే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది ఆ సమయంలో. అయితే కరోనాను యూకే నియంత్రించగలిగింది. ఇప్పుడు కూడా కాస్తో కూస్తో కేసులు నమోదవుతున్నా, అత్యున్నత స్థాయి వైద్య సదుపాయాలు కలిగిన దేశం కావడంతో.. కరోనాకు యూకే ఇప్పుడు భయపడటం లేదు.
రోజుకు ఐదారు వందల కేసులు రిజిస్టర్ అవుతున్నా, కరోనాను జయించి ముందడుగులు వేస్తూ ఉంది యూకే. ఈ క్రమంలో క్రికెట్ మ్యాచ్ లకు కూడా రంగం సిద్ధం చేశారు బ్రిటీషర్లు. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ఇంగ్లండ్- వెస్టిండీస్ ల మధ్యన మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే చాన్నాళ్ల కిందట వెస్టిండీస్ క్రికెటర్లు ఇంగ్లండ్ చేరుకున్నారు.
అంతర్జాతీయంగా క్రికెట్ మ్యాచ్ లు ఆగిపోయి చాలా కాలం అవుతూ ఉంది. మార్చి నెలలోనే మ్యాచ్ లన్నీ రద్దు అయిపోయాయి. సీజన్ ప్రారంభ సమయం అది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇంటర్నేషనల్ మ్యాచ్ లే కాదు, గల్లీ మ్యాచ్ లు జరిగే అవకాశం కూడా లేకపోయింది. ఈ క్రమంలో కరోనా పై దాదాపుగా విజయం సాధించిన ఇంగ్లండ్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కు కూడా ధైర్యంగా ఆతిథ్యం ఇస్తూ ఉంది. కొత్త ఆశను రేపుతూ ఉంది.