ఏపీ విభజన అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉందని బల్లగుద్ది వాదిస్తూ ఉంటారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. మాజీ కాంగ్రెస్ నేత అనాలో, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుల పార్టీ మాజీ నేత అనాలో కానీ.. ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నట్టుండి తెలంగాణ సీఎం కేసీఆర్ పంచన కనిపించడం ఆసక్తిదాయకంగా మారింది.
సమకాలీన రాజకీయ అంశాలపై అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. జాతీయ స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలను తప్పు పడుతూ ఉంటారు. ఏపీ రాజకీయంపై కూడా హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.
అదలా ఉంటే ఇప్పుడు ఉండవల్లి ఉన్నట్టుండి కేసీఆర్ తో సమావేశం కావడం వెనుక రాజకీయం ఏమిటనేది చర్చగా మారింది. ఉండవల్లి పాల్గొన్న సమావేశంలో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాల గురించి చర్చించారట. ఈ చర్చలో రాష్ట్రపతి ఎన్నిక, కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం వంటి అంశాల మీద చర్చ జరుగుతోందట!
మరి ఈ సమావేశం కోసమే ఉండవల్లిని కూడా పిలిపించుకున్నారు కాబోలు కేసీఆర్! ఏదేమైనా.. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన, ఇప్పటికీ విభజన బిల్లుపై కోర్టు విచారణ జరగాలని వాదిస్తున్న నేతను కేసీఆర్ పిలిపించుకుని ఉంటే అది విశేషమే. జాతీయ రాజకీయాల గురించి ఉండవల్లి సలహాలు, సూచనలను కేసీఆర్ తీసుకుంటున్నారనుకోవాలా! లేక ఈ భేటీ వ్యక్తిగతమో!