వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గన్నవరం లొల్లి పతాక శీర్షికలకు చేరుతోంది. ఎన్నికలు ఎప్పుడొస్తాయో కానీ.. ఇక్కడ అధికార పార్టీలో మాత్రం వచ్చే ఎన్నికల గురించి చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వరసగా రెండు పర్యాయాలు పార్టీ తరఫున ఓడిన నేతలు, తెలుగుదేశం పార్టీ వైపు నెగ్గి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరువైన నేత మధ్యన మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది.
ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో వల్లభనేని వంశీ చేతిలో 990 ఓట్ల తేడాతో ఓడిన యార్లగడ్డ వెంకట్రావు తను ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీకి సహకరించేది లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంశీ బరిలోకి దిగితే తన మద్దతు ఉండదని వెంకట్రావు తేల్చి చెప్పారు.
ఇక 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన దుట్టా రామచంద్రరావు కూడా వంశీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. వీరిద్దరిపై వంశీ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. తను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమ్మతితోనే పార్టీ యాక్టివ్ గా ఉన్నట్టుగా ఆయన చెప్పుకుంటున్నారు.
తనపై సమస్య ఉంటే వెళ్లి సీఎంతో చెప్పుకోవాలని ఆయన బాహాటంగా వ్యాఖ్యానించారు. టీవీల్లో కనిపించడానికే వారు తాపత్రయపడుతున్నట్టుగా, ఇళ్లలో కూర్చున్నారంటూ వారిని దెప్పి పొడిచారు వంశీ. మొత్తానికి గన్నవరం గరంగరంగా మారింది!