జూన్ 13 సంతోషం, బాధ కలిసిన ఒక స్పెషల్ డే. తెలంగాణాలో స్కూళ్లు తెరిచారు. ఆంధ్రలో ఈసారి షెడ్యూల్ మారింది. ఏమైతేనేం చిన్నప్పుడు బాగా గుర్తు పెట్టుకున్న రోజు.
జూన్ స్టార్ట్ అవగానే కౌంట్‌డవున్. ఆటలు, ఈతలు, సినిమాలు అన్నీ బంద్. స్కూల్, టీచర్లు, హోంవర్క్, దెబ్బలు, డ్రిల్ నరకం మొదలైపోతుంది. ఎంత వద్దనుకున్నా 13 రానే వస్తుంది. ఏడుపు మొహంతో స్కూల్‌కెళ్లేవాళ్లం. సంతోషం ఏమంటే Next క్లాస్‌కి ప్రమోషన్. బాధ ఏమంటే పాత స్నేహితులు కొందరు మిస్సయిపోతారు.
వాళ్ల నాన్నకి ట్రాన్స్‌ఫర్ అయితే వీళ్లు వుండరు. కొందరు కొత్తవాళ్లు వస్తారు. స్కూల్‌కి వెళ్లే వరకూ బాధకానీ, వెళ్లిన తరువాత ఫ్రెండ్స్‌ని చూసి ఉత్సాహం. ఆ రోజు కొంచెం పెద్దవాళ్లయిన ఫీలింగ్. సెవెన్త్‌కి వెళ్లినపుడు సిక్త్స్ వాళ్లు బచ్చాల్లా కనిపిస్తారు.
సెవెన్త్ నుంచి ఎయిత్‌కి వెళ్లినపుడు కొంచెం గర్వం పెరిగింది. ఎందుకంటే నేల పోయి డెస్క్‌లు వచ్చాయి. పూర్వకాలం నాటివి. వాటి మీద ఇంకు సీసా పెట్టుకునే స్పేస్ ప్రత్యేకంగా వుండేదంటే అవి ఏ కాలంవో వూహించుకోవచ్చు. ఇప్పటి పిల్లలకి బాధ లేదు. అంతా ఒకటే లెక్కలు. అప్పట్లో ఎనిమిదవ తరగతిలో కాంపొజిట్, జనరల్ అని లెక్కల్లో రెండు విభాగాలుండేవి. ఇంజనీర్ కావాలనుకునే వాళ్లంతా కాంపొజిట్, వద్దనుకునే వాళ్లు జనరల్.
లెక్కలు అర్థం కాని నాలాంటి వాళ్ల చర్మం ఒలవడానికి కొంత మంది మేధావులు జామెట్రీ, ట్రిగనామిట్రీ కనిపెట్టారు. సైన్, కాస్, టాన్, సీకెంట్, కొసికెంట్ ఇంత దుర్మార్గమైన పదాలను గుర్తు పెట్టుకుని లెక్కలు చేయాలి. పీడకలలు రావడానికి తప్ప ఈ ట్రిగనామిట్రి ఎందుకూ ఉపయోగపడలేదు.
నైన్త్ నుంచి టెన్త్ వెళ్లినపుడు జూన్ 13 మరీ ప్రమాదకరంగా కనిపించింది. మొదటి రోజు నుంచి అందరూ భయపెట్టడమే. ఈ సారి మీరు టెన్త్ , పబ్లిక్ తెలుసా అని బెదిరించే వాళ్లు. టెస్ట్‌ల్లో మార్కులు తక్కువస్తే ప్రతివాళ్లు బెదిరించడమే. ఈ సారి నువ్వు పాసయినట్టే ఇదొక కామన్ డైలాగ్. భయం భయంగానే పాసయ్యాను.
స్కూల్ ఎగ్జామ్స్ కంటే జీవితం పెట్టే ఎగ్జామ్ మరీ టఫ్. మనకంటూ ప్రత్యేక క్వశ్చన్ పేపరుంటుంది. కాపీ కొట్టాలన్నా సాధ్యం కాదు. ఫెయిలవుతుంటాం కానీ లోకం మనల్ని పాస్ అంటుంది. పాస్ అని మనం అనుకున్నవి లోకం దృష్టిలో ఫెయిల్.
చిన్నప్పుడు జూన్ 13 తెలిసీ భయపెట్టేది. ఇపుడు తెలియకుండా చాలా తేదీలు భయపెడుతాయి.
జీఆర్ మహర్షి