దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీ ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. త్వరలో కేసీఆర్ ఆలోచనలు కార్యరూపందాల్చనున్నాయి. మోదీ నాయకత్వంలోని అరాచకాలను అడ్డుకునేందుకు జాతీయ స్థాయి రాజకీయాలు చేయడానికి చక్కటి వేదిక కోసం పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
బీజేపీకి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని కేసీఆర్ ఆరోపణ. జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ పోషించలేకపోతోందని కేసీఆర్ మనసులో మాట. ఈ నేపథ్యంలో తానే జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ఆయన ముందుకొస్తున్నారు. ఇదిలా వుండగా కేసీఆర్ పార్టీ ప్రభావం ఏపీలో ఏ మాత్రం వుంటుందనే చర్చకు తెరలేచింది.
ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్ భేటీ కావడం కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఏపీ విషయంలో బీజేపీ తీవ్రమైన ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందనే ఆవేదన వుంది. అయితే మోదీ సర్కార్ ఏపీ వ్యతిరేక విధానాలను ప్రశ్నించే పార్టీలు ఏపీలో కొరవడడం తీవ్ర నిరాశ కలిగించే అంశం. ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీకి వంతపాడుతున్నాయి.
వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోదీ విశ్వాస పార్టీలుగా చెలామణి అవుతున్నాయి. దీంతో మోదీని గట్టిగా నిలదీసే పార్టీకి మద్దతు తెలిపే వివిధ ప్రజాసంఘాల నాయకులు, మేధావులు తక్కువేం కాదు. అందుకే ఏపీలో కేసీఆర్ జాతీయ పార్టీలో చేరేందుకు కొందరు ఆసక్తి కనబరుస్తున్నారనే చర్చ జరుగుతోంది.
అలాంటి వారిలో ఉండవల్లి అరుణ్‌కుమార్, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు చెందిన నేతలున్నారని సమాచారం. అయితే పూర్తిగా పార్టీ విధివిధానాలు వెల్లడైన తర్వాతే చేరికలుంటాయని సమాచారం. మొత్తానికి మరో రాజకీయ వేదిక మాత్రం తెరపైకి రానుంది.