జ‌న‌సేన యాత్ర వెనుక అస‌లు ఎజెండా!

జ‌న‌సేన ప‌వ‌న్‌క‌ల్యాణ్ అక్టోబ‌ర్ 5 ద‌స‌రా నాడు బ‌స్సు యాత్ర‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఇందుకు తిరుప‌తిని వేదికగా ఎంచుకున్నారు. రూట్ మ్యాప్ త‌యారీలో జ‌న‌సేన నాయ‌కులు నిమ‌గ్న‌మ‌య్యారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్ని ట‌చ్ చేస్తూ యాత్ర…

జ‌న‌సేన ప‌వ‌న్‌క‌ల్యాణ్ అక్టోబ‌ర్ 5 ద‌స‌రా నాడు బ‌స్సు యాత్ర‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఇందుకు తిరుప‌తిని వేదికగా ఎంచుకున్నారు. రూట్ మ్యాప్ త‌యారీలో జ‌న‌సేన నాయ‌కులు నిమ‌గ్న‌మ‌య్యారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్ని ట‌చ్ చేస్తూ యాత్ర సాగేలా రూట్‌మ్యాప్ త‌యారు చేయ‌నున్నారు. అలాగే ఉమ్మ‌డి జిల్లాల్లో బ‌హిరంగ స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌, మే నాటికి ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని, అందుకే ప‌వ‌న్ బ‌స్సు యాత్రకు సిద్ధ‌మ‌య్యార‌ని జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. మొత్తం ఆరు నెల‌ల పాటు యాత్ర కొన‌సాగుతుంద‌న్నారు. ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా జ‌న‌సేన సిద్ధంగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

అయితే జ‌న‌సేనాని బ‌స్సు యాత్ర వెనుక అస‌లు ఎజెండా వేరే ఉంద‌ని రాజ‌కీయ విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. త‌మ‌తో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌పించార‌ని, తాము గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన త‌ర్వాత మౌనాన్ని ఆశ్రయించార‌ని జ‌న‌సేన నేత‌లు వాపోతున్నారు. 

బాదుడేబాదుడు, మ‌హానాడు విజ‌య‌వంత‌మ‌య్యాయ‌ని, ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌, అలాగే టీడీపీకి ఆద‌ర‌ణ పెరిగింద‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు జోష్ మీద ఉన్నారు. ఇక జ‌న‌సేన‌తో పొత్తు కుదుర్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఆ పార్టీ ఆరో వేలు అవుతుందనే ఆందోళ‌న టీడీపీలో క‌నిపిస్తోంది.

చివ‌రికి తాను మూడు ఆప్ష‌న్లు ఇచ్చినా చంద్ర‌బాబు మొద‌లుకుని ఏ ఒక్క టీడీపీ ముఖ్య నాయ‌కుడు స్పందించ‌క‌పోవ‌డాన్ని తీవ్ర అవ‌మానంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ భావిస్తున్నారు. దీంతో టీడీపీకి త‌న స‌త్తా ఏంటో చూపాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌వ‌న్ ఉన్నార‌ని స‌మాచారం. అందుకే బ‌స్సుయాత్ర‌కు శ్రీ‌కారం చుట్టార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

బ‌స్సు యాత్ర‌కు జ‌నం వెల్లువెత్తితే, అప్పుడు చంద్ర‌బాబు తిరిగి త‌న వెంట ప‌రుగెత్తుతార‌ని ప‌వ‌న్ భావిస్తున్నార‌ని తెలిసింది. చంద్ర‌బాబే త‌న వ‌ద్ద‌కు వ‌స్తే డిమాండ్ ఆప్ష‌న్ వుంటుంద‌ని ప‌వ‌న్ గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. త‌న‌కు తానుగా ఆప్ష‌న్లు పెట్ట‌డం వ‌ల్ల టీడీపీకి అలుసైంద‌నే ఆవేద‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్టు స‌మాచారం.

ఇదే సందర్భంలో బీజేపీ త‌న‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డానికి లెక్క‌లేసుకోవ‌డంపై కూడా ప‌వ‌న్ ఆగ్ర‌హంగా ఉన్నార‌ని స‌మాచారం. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌నే చందంగా బ‌స్సుయాత్ర‌తో ఇటు టీడీపీ, అటు బీజేపీని త‌న కాళ్ల ద‌గ్గ‌రికొచ్చేలా చేసుకునే వ్యూహంలో భాగంగానే బ‌స్సుయాత్ర‌కు సిద్ధ‌మైన‌ట్టు జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. 

ఏపీలో ప‌వ‌న్ బ‌లం ఏంటో బ‌స్సుయాత్ర ద్వారా చాటి చెబుతామ‌ని జ‌న‌సేన నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగానే బ‌స్సుయాత్ర చేప‌ట్టార‌ని, వివిధ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారాన్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.