ఏపీకి గ‌డ్డు ప‌రిస్థితే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితిపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న నెల‌కుంది. ఆర్థిక స్థితి కేంద్రంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఆర్థిక ద‌య‌నీయ స్థితికి గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఏపీ ప్ర‌భుత్వం చెప్ప‌డం మిన‌హా…అందులో…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితిపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న నెల‌కుంది. ఆర్థిక స్థితి కేంద్రంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఆర్థిక ద‌య‌నీయ స్థితికి గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఏపీ ప్ర‌భుత్వం చెప్ప‌డం మిన‌హా…అందులో నిజం లేద‌ని  చెప్ప‌లేని స్థితి. ఈ నేప‌థ్యంలో ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

రాజ‌మండ్రిలో ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఆర్థిక ప‌రిస్థితి అస్త‌వ్య‌స్తంగా మారింద‌న్నారు. వైసీపీ ప్ర‌భుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తున్న‌ట్టు ఆరోపించారు. అమ‌రావ‌తిని కూడా తాక‌ట్టు పెట్టి అప్పులు తెస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వంలో ఎంతో మంది స‌ల‌హాదారులున్నా ఆర్థిక గండం నుంచి గ‌ట్టెక్కించ‌లేకున్నార‌ని అన్నారు. మ‌రి ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు ఏం చేస్తున్నార‌ని ఆయ‌న నిల‌దీశారు.

రానున్న కాలంలో ఏపీలో ఇదే ఆర్థిక‌ పరిస్థితి కొనసాగితే మాత్రం రాష్ట్రానికి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించ‌డం గ‌మ‌నార్హం. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని ఆయన విమ‌ర్శించారు.   

వన్ నేషన్.. వన్ రేషన్ కార్డుకు దేశంలోని ఏ రాష్ట్రం ఒప్పుకోకపోయినా ఏపీ మాత్రం ఒప్పుకుంద‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల‌న‌లో ఏ విధంగా ఉందో, ఇప్పుడూ అట్లే ఉంద‌న్నారు. నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందడంలేద‌న్నారు. పోలవరం నిధులపై ఇప్పటికీ  స్పష్టత లేద‌ని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

వైఎస్సార్ అంటే అమిత‌మైన ప్రేమ క‌న‌బ‌రిచే ఉండ‌వ‌ల్లి… జ‌గ‌న్ అభిమానిగా టీడీపీ నేత‌లు విమ‌ర్శించ‌డం తెలిసిందే. జ‌గ‌న్ పాల‌న‌పై కూడా ఉండ‌వ‌ల్లి ప‌లుమార్లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తాజాగా మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వ ఆర్థిక ప‌రిస్థితిపై ఘాటు వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.