ఉద్యోగులు, ఏపీ ప్రభుత్వం మధ్య కొత్త పీఆర్సీ గొడవ పెంచుతోంది. పీఆర్సీ సాధన సమితి నాయకులపై ఇవాళ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అసలు ప్రభుత్వంతో చర్చలు జరపకుండా టీవీ చానళ్లలో కూచొని మాట్లాడితే ప్రయోజనం ఏంటని నిలదీశారు. చర్చలకు రాకుండా ఉద్యోగ సంఘాల నేతలు వివాదాన్ని మరింత జఠిలం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సజ్జల విమర్శలపై పీఆర్సీ సాధన సమితి నాయకులు గట్టి కౌంటర్ ఇచ్చారు. పీఆర్సీ సాధన సమితి నాయకులు సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఉద్యోగ సంఘం నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సజ్జలకు దీటైన సమాధానం ఇచ్చారు.
ఉద్యోగులు, ప్రజలకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని వాపోయారు. ఉద్యోగులే చర్చలకు రాలేదనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతున్నారని విమర్శించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ తాము అనేక సార్లు తిరిగామని ఆయన గుర్తు చేశారు. 40 పాయింట్లకుపైన సజ్జలతో సుదీర్ఘంగా చర్చించామన్నారు. తమకు జరిగిన ప్రతి అన్యాయానికి సజ్జల సాక్ష్యం కాదా? అని బొప్పరాజు ప్రశ్నించడం గమనార్హం. చర్చలకు కొత్త సంఘాలు కూడా రావాలని ఆహ్వానిస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా ఎన్ని సంఘాలను చీలుస్తారని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. ట్రెజరీ ఉద్యోగులు కూడా తమలో భాగమేనన్నారు. వారిపై చర్యలు తీసుకుంటే తమను రెచ్చగొట్టడమే అని ప్రభుత్వానికి ఆయన తేల్చి చెప్పారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడకు లక్షలాది మంది ఉద్యోగులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.