వ్యాక్సిన్ విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. కరోనాకు చెక్ పెట్టేలా దేశీయ వ్యాక్సిన్ రెడీ అంటూ గత ఏడాదే ఆర్భాటపు ప్రకటనలు చేశారు. అయితే ఆ ప్రకటనలు వచ్చి ఏడాది కావొస్తున్నా.. ఇప్పటి వరకూ అత్యవసర వినియోగానికి కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఆమోద ముద్ర పొందలేకపోతోంది భారత దేశీయ వ్యాక్సిన్. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే భక్తులకు కోపం వస్తుంది.
దేశీయ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ కు సంబంధించి వివరాలను ఇచ్చి, అంతర్జాతీయ వైద్య సమాజాన్ని ఒప్పించలేకపోతున్నారా? ఇంకా ఎప్పటికి మూడో దశ ట్రయల్స్ కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేస్తారో మరి. మరో వైపు మూడో దశ ట్రయల్స్ వివరాలు బయటకు రాకపోయినా.. దేశంలో కోటానుకోట్ల మందికి వ్యాక్సినేషన్ మాత్రం జరిగిపోతూ ఉంది! అంటే ఫలితాలపై స్పష్టత ఇవ్వకుండానే ఇలా కోట్ల మందికి వ్యాక్సినేషన్ జరపొచ్చని మనోళ్లు నిరూపించేశారు. ఈ విషయంలో ఏ చైనానో, మరో రష్యానో ఆడిపోసుకుంటూ ఉంటారు.
పూర్తి స్థాయి క్లినికల్ ట్రయల్స్ లేకుండానే వ్యాక్సిన్ ను కొన్ని కోట్ల మందికి పొడిచేస్తున్నారంటే.. మన దేశ వ్యవస్థను ఏమనాలో మరి! ఏ చైనానో ఇలాంటి పని చేసి ఉంటే.. నియంతృత్వం అని, ప్రజలకు బలవంతంగా వ్యాక్సిన్లు వేస్తోందని, టెస్టులు పూర్తి కాకుండానే పొడిచేస్తున్నారంటూ.. మనం కూడా దుమ్మెత్తిపోసే వాళ్లం! అయితే ట్రయల్స్ వివరాలు లేని వ్యాక్సిన్ ను ఇండియాలో పొడుస్తున్నది దేశభక్త ప్రభుత్వం కాబట్టి.. ఇదంతా దేశభక్తే అనుకోవాలి. ఫలితాలు ఏమిటో పూర్తిగా తెలియకుండా ప్రజలంతా సామూహికంగా వ్యాక్సినేసుకోవాలి. అదే దేశభక్తి.
ఇక అంతకన్నా దారుణం ఏమిటంటే.. సదరు వ్యాక్సిన్ సమర్థత గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. ఒకరేమో ఇండియన్ దేశీ వ్యాక్సిన్ కన్నా.. కోవీషీల్డే ఎక్కువ ప్రభావవంతం అంటున్నారు. ఈ విషయం గురించి తాము పరిశోధించినట్టుగా ఆ అధ్యయన సంస్థలు ప్రకటిస్తున్నాయి. అసలుకు కోవీషీల్డే 60 శాతం ప్రభావవంతం అంటూ అధ్యయనాలు చెబుతుంటే, ఇండియన్ డొమెస్టిక్ వ్యాక్సిన్ కన్నా.. కోవీషీల్డే బెటర్ అంటూ చెబుతున్నారు అధ్యయనకర్తలు! ఆ మరుసటి రోజే.. మరో అధ్యయనం.
కోవీషీల్డ్ బెటరే కానీ, దేశీయ వ్యాక్సిన్ కూడా ఫర్వాలేదంటూ మరో అధ్యయన సంస్థ కితాబిచ్చినట్టుగా మరో కథనం వస్తుంది! ఈ వ్యాక్సిన్లను అమ్ముకునే వాళ్లకు బంధువులు అయిన ఒక పత్రిక వాళ్లు తమ శక్తిమేరా ఈ విషయంలో కూడా సేవలందిస్తున్నారు!
ఇక ధర విషయానికి వస్తే.. ఈ విషయంలో కూడా దేశీయ వ్యాక్సిన్ రూపకర్తలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రభుత్వం చెల్లించే ధర చాలదంటున్నారు. వాస్తవానికి ఇప్పుడు విదేశీ వ్యాక్సిన్ల కన్నా దేశీయ వ్యాక్సినే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు ప్రైవేట్ లో. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కోవీషీల్డ్, స్పూత్నిక్ వంటి వ్యాక్సిన్ల కన్నా.. భారత దేశీయ వ్యాక్సినే ఎక్కువ రేటు! అంతర్జాతీయంగా ఆమోదం ఉన్న వ్యాక్సిన్ల కన్నా.. ఆమోదం లేని వ్యాక్సినే ఎక్కువ రేటుకు అమ్ముతుండటం ఏమిటో మరి.
అలాగే దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ఉత్పత్తిని పెంచడానికి అనుగుణంగా ఫార్ములాను షేర్ చేసుకోవాలని ప్రభుత్వాలు కోరుతుంటే.. దేశీయ వ్యాక్సిన్ రూపకర్తలు మాత్రం.. అబ్బే అదంతా సాధ్యం కాదంటూ మొదట ప్రకటనలు చేశారు! దేశ అవసరాలతో తమకు అవసరం లేదని, తామే రూపొందించి తామే అమ్ముకోవాలి తప్ప.. లాభాలను మరొకరితో పంచుకునే ప్రసక్తే లేదని వారు క్లారిటీ ఇచ్చారు. అలా తమ దేశభక్తిని నిరూపించుకున్నారు.
ఇంకో విషయం.. కరోనాకు తాము తెచ్చే వ్యాక్సిన్ ధర మంచినీళ్ల రేటు కన్నా తక్కువ స్థాయిలో ఉంటుందంటూ మొదట్లో వీళ్లే గప్ఫాలు కొట్టుకున్నారు! లీటర్ మినరల్ వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు అనుకుంటే.. బహుశా కరోనా వ్యాక్సిన్ ను కూడా ఆ ధరకు అందిస్తారని చాలా మంది భ్రమ పడ్డారు. మంచినీళ్ల కన్నా తక్కువ రేటుకే వ్యాక్సిన్ ను అందిస్తామన్న వాళ్లు కాస్తా… ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే ధర కూడా చాలదంటున్నారు. ప్రైవేట్ లో అత్యధిక రేటుకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఎక్కువ ధర చెల్లించాల్సిందంటూ అప్పుడే పాట మొదలుపెట్టారు!
మొదట చెప్పేదొకటి తర్వాత చేసేదొకటి అన్నట్టుగా మారింది ఈ వ్యవహారం. దేశం అత్యంత విపత్తును ఎదుర్కొంటున్న వేళ కూడా ఫార్మా కంపెనీలు తమ వ్యాపార ప్రయోజనాలనే అంతిమంగా భావిస్తున్నాయని స్పష్టం అవుతోంది. వారు చేస్తున్న వ్యాపారానికి తగిన స్థాయిలో లాభం ఆశించడంలో తప్పు లేకపోవచ్చు గాక.
అయితే మొదట చెప్పిన మాటలకూ, ఇప్పుడు చేస్తున్న దానికి పొందలేకపోవడం, వ్యాక్సిన్ కు ఇంకా డబ్ల్యూహెచ్వో అత్యవసర వినియోగానికి అంటూ కూడా ఆమోదముద్ర వేయించుకోలేకపోవడం.. ఇంతలోనే.. రేటు కూడా పెంచాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉండటమే విడ్డూరంగా ఉంది.
హిమ