''….దొంగలు..దొంగలు ఊళ్లు పంచుకుని దొరలైపోతుంటే వాటా దొరకని వాడు వేరే పార్టీ పెడతాడు…'' అని కవి ఆత్రేయ చాలా దశాబ్దాల కిందటే చెప్పేసాడు. ఒక్క లైన్ లో పొలిటికల్ పార్టీల పుట్టుకని నిర్వచించాడు. పేరేదైతేనేం ప్రతి ప్రతి పార్టీ పుట్టుక వెనుక ఓ స్వార్థం…ఓ కారణం..పేరేదయితేనేం..ప్రతి రాజకీయ నాయకుడి వెనుక ఓ అవకాశం అందిపుచ్చుకునే ఆలోచన. స్వాములు లేని ఏరియాలు, స్కాముల్లేని పార్టీలు ఇప్పుడు దాదాపుగా లేవేమో?
ఈ మధ్య ఓ మలయాళ సినిమా చూసాను. సాధారణంగా దొంగల్ని పోలీసులు తరుముతుంటారు. అది ఆసక్తిగా మలచి తీసిన సినిమాలు చూసాం. కానీ ఈ సినిమాలో పోలీసుల్ని పోలీసులు తరుముతుంటారు. పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం పోలీసులే నేరస్థుల్లా ఆలోచనలు చేస్తుంటారు. ఆ సినిమా, ఆ కథ కమామిషు ఎలా వున్నా, తెలుగు నాట రాజకీయాలు ఇలాగే కొత్త పుంతలు తొక్కుతున్నట్లు కనిపిస్తోంది.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నుంచి అధికారంలో ఎవరు వున్నా, రాజకీయ నాయకులకు పనులు జరుగుతూనే వున్నాయి. పనులు జరిగినా జరగకపోయినా, అధికారంలో వున్నపుడు సంపాదించింది పొగొట్టుకునే పరిస్థితులు అయితే లేవు. పైగా మనం మనం బరంపురం అనే థియరీ ఒకటి అన్యాపదేశంగా, కనిపించకుడా వుంటూనే వస్తోంది. అనకూడదు కానీ చంద్రబాబు జమానాలో అయినా, వైఎస్ పాలనలో అయినా కూడా, అస్మదీయులతో పాటు తస్మదీయులకు కూడా కాస్త విదిలించడం అన్నది ఓ రాజకీయ రివాజుగా వుండేది.
కానీ అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్లే రాజకీయాల్లోనూ మార్పలు వస్తున్నాయి. వేలిముద్రల రాజకీయాలు పోయాయి. వాళ్లతా పాపం చిరుతిళ్లు తినే బాపతు. ఆ రోజుల్లో పర్మిట్లు ఇప్పించి, ఉద్యోగాలు వేయించి, బదిలీలకు సిఫార్సులు చేయించి, వంద, వెయి తీసుకుని సంతృప్తి చెందిపోయిన బాపతు. కానీ ఇప్పుడు యువతరం కదిలింది. పెద్ద పెద్ద డిగ్రీలు పేరు వెనుక పెట్టుకున్న వారంతా రాజకీయాల్లోకి వచ్చారు. అసలు రాజకీయాల స్వరూపమే సమూలంగా మారిపోయింది.
రాజకీయాలు కూడా భారీ రేంజ్ కు చేరిపోయాయి. వేలు, లక్షలు అన్నవి పక్కకు పోయాయి. ఇప్పుడంతా కోట్లు. షేర్ లు, భూములు. స్కెచ్ లు..ప్లానింగ్ లు..ఇలా చేయడం వల్ల ఇప్పుడు రాజకీయాల రేంజ్ కోట్లను దాటిపోయింది. ఖర్చు కూడా అలాగే కోట్లను దాటేసింది. అంటే ఎన్ని కోట్లు పెట్టుబడి పెడితే ఎన్ని కోట్లు సంపాదించవచ్చు అన్నది ఓ లెక్కగా మారిపోయింది.
అయితే ఈ విషయంలో అధికారంలో వున్నవారికి అవకాశాలు ఎక్కువ వుంటాయి. ప్రతిపక్షంలో వున్నవారికి వుండవు అని కాదు. తక్కువ వుంటాయి. నిన్నటి తరానికి చెందిన వైఎస్, చంద్రబాబు లాంటి వాళ్లు ఈ విషయంలో కాస్త లిబరల్ గా వుండేవారని టాక్. రూపాయి పనుల్లో తమవారికి అరవై డెభై శాతం అందించినా, ముఫై నలభై శాతం ప్రతిపక్షానికి కూడా విదిలించేవారు. అందువల్ల అందరి వ్యవహారం హ్యాపీగా సాగిపోతూ వస్తోంది.
కానీ వర్తమానంలో కేసిఆర్, జగన్ లాంటి వాళ్లు అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవహారం మరింతగా మారిపోయింది. పగవాడి వ్యవహారాలు అన్నీ కెలికి కెలికి వెలికి తీసి, వాడిని రోడ్డు మీదకు లాగేయడం అన్నది కొత్త కాన్సెప్ట్ గా మారింది. పక్కన కాక ఎదురుగా వున్నవాడి లెక్కలు తేల్చేస్తున్నారు. ఆఘమేఘాల మీద అధికారులు కదిలి కబ్జాల లెక్కలు పీకుతున్నారు. నోటీసులు ఇస్తున్నారు. అది తెలంగాణలో ఈటెల రాజేందర్ కావచ్చు.. విశాఖలో పల్లా శ్రీనివాసరావు కావచ్చు.
ఈ కొత్త పద్దతి మంచి చెడ్డలు తర్కించుకునే ముందు అసలు వర్తమాన రాజకీయ నాయకులందరికీ వున్న కామన్ ముచ్చట గురించి ముచ్చటించుకుందాం. భూములు..భూములు..భూములు. ఇదే యావ. దీనికి మాత్రం బీజం వేసిన ఘనత చంద్రబాబుకే దక్కాలి. హైటెక్ సిటీ, సైబరాబాద్ అనే ప్లానింగ్ దేశం మొత్తం మీద మరో రాజకీయ నాయకుడికి తట్టని అంశం. అస్మదీయులు అందరికీ చాలా చాలా కీలకమైన చోట్ల స్థలాల ఎకరాలకు ఎకరాలు దొరికేసాయి. అప్పటి వరకు గజాల లెక్కన కొనుక్కుంటూ, చిన్న చిన్నగా వున్న వారంతా ఒక్కసారిగా ఎకరాలకు ఎగబాకేసారు. ఆనాడు వేసిన విత్తనాలు ఈనాడు మహా వృక్షాలై ఫలసాయం అందిస్తున్నాయి.
అదిగో అప్పటి నుంచీ రాజకీయ నాయకులకు భూముల యావ పట్టుకుంది. బీరువాల్లోనూ, బాత్ రూమ్ ల్లోనూ దాస్తే ప్రయోజనం ఏముంది? ఇన్ కమ్ టాక్స్ ప్రమాదం తప్ప. అదే భూముల రూపంలో దాస్తే. ఐడియా బాగానే వుంది. కానీ దానికి మించి అసలు కొనకుండానే భూములు సంపాదిస్తే, మరీ సూపర్ ఐడియా కదా? ప్రభుత్వ భూములకు దగ్గర్లో ఎకరానో, పదెకరాలో కొనేసి, పక్కన వున్నవి మెల్లగా కలిపేసుకుంటే..? లేదా ప్రభుత్వ స్థలాలు చౌకగా లీజుకు తీసుకుని, తమ గుప్పిట్లో వుంచుకుని, అంతకు పదింతలకు వేరే వాళ్లకు మనం లీజుకు ఇస్తే..కాలపరిమితి దాటేసినా ఖాళీ చేయకుండా వుంటే…ఇది ఇంకా సూపరు కదా?
అసలు విజయవాడ, విశాఖ ల్లాంటి మహా నగరాల నడిబొడ్డున ఓ మాల్ కట్టాలంటే ఎన్ని కోట్లు కావాలి కేవలం స్థలం కొనడానికి. అదే అక్కడ ప్రభుత్వానికి ఏ ఆసుపత్రో, ఇంకోటో వుంటే దాన్ని తరలించేసి, ఆ స్థలం తాము లీజుకు తీసేసుకుంటే చాలు పని అయిపోయింది. ఆ లీజు అగ్రిమెంట్ చూసి బ్యాంకులు లోన్లు ఇస్తాయి. ఆ రుణాలతో మాల్ కట్టేస్తే నెల నెల బంగారు బాతుగుడ్లే కదా. టీబీ ఆసుపత్రో, ఆర్టీసీ ఆసుపత్రో పోతే పోతుంది. ఇది విశాలంగా లేదు, సౌకర్యవంతంగా లేదు. అని చెప్పి మరో చోటకు తరలించేస్తే పాయె. అంతా మన చేతిలో పనే కదా? అదీ కాకపోతే మైనారిటీ సంస్థ అనో, బడుగు బలహీన వర్గాల సంస్థో అని కవర్ పేజీ చూపించి విద్యాసంస్థ రిజిస్టర్ చేయడం. ప్రభుత్వం ఓ పది ఎకరాలు పడేయడం. ఎకరా కోటి వున్న దగ్గర లక్ష రేటు సిఫార్సు చేయడం.
ఇలా భూములు..భూములు..భూముల చుట్టే రాజకీయం మొత్తం తిరిగేస్తోంది. అదేంటో సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే రాజకీయాలు అన్నీ భూముల చుట్టూ తిరగడం. ఆ ఆకర్షణ అలాంటిది మరి. ఇలా భూముల కోసం మార్గాలు అన్వేషిస్తుంటే అన్నింటి కన్నా సులువైనది కబ్జానే అన్నట్లుగా కనిపించింది. అందుకే గడచిన ప్రభుత్వ కాలంలో విశాఖలో భూముల కబ్జా కాండ అపరిమితంగా సాగిపోయింది. అప్పటి మంత్రి అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్లు దీని మీద నానా గడబిడ చేయడం, ప్రభుత్వం ఓ కమిటీ వేయడం, అది విచారణ చేయడం, ఆ తరవాత ఏదేదో చాలా జరిగాయి. కానీ నిగ్గు తేల్చి, ప్రభుత్వానికి చెందిన భూమిని సెంటు కూడా వెనక్కు తీసుకున్నట్లు వార్తలు అయితే కనిపించలేదు.
సరే ఆ విధంగా రాజకీయాలు మొత్తం భూముల చుట్టూ తిరగడం ప్రారంభమైంది. రాజకీయాల్లో సంపాదన అంటే భూములు అన్నట్లు మారింది. ఎన్నికల టైమ్ లో పెట్టుబడి పెట్టాలంటే భూములు అమ్మడం అన్నది కామన్ అయింది.
కానీ ఇప్పుడేమయింది. ఇక్కడ జగన్ , అక్కడ కేసిఆర్ అధికారంలోకి వచ్చారు. వీళ్లకు దయ దాక్షిణ్యాలు లేవు. వైఎస్, చంద్రబాబులా ప్రతిపక్షాన్ని కూడా కాస్త దయచూడడం అన్నది లేదు. వైరి పక్షం అంటే భూముల మీద దెబ్బ పడాల్సిందే అన్నట్లు సాగుతోంది వ్యవహారం.
విశాఖలో అదే జరుగుతోంది. దశాబ్దాల కాలంగా ఓ సామాజిక వర్గం విశాఖ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంది. అన్ని రంగాల్లో తామే పాతుకుపోయేలా ప్లాన్ చేయగలిగారు. అధికారం సరేసరి, ఆర్జన సరేసరి, పనిలో పనిగా కబ్జాలు కూడా. సరే పార్టీ అన్నాక ఆ ఒక్క వర్గమే వుండదు కదా? చిన్న చితక జనాలు కూడా వుంటారు. వాళ్లు కూడా అంత లెవెల్ లో కాకపోయినా, కొంతయినా సంపాదించుకున్నారు.
దీని మీద వైకాపా కన్ను పడింది. చేపను చంపక్కరలేదు. నీళ్లలోంచి తీసి ఒడ్డున పడేస్తే చాలు. అలాగే రాజకీయ నాయకుడిని ఏదో చేయక్కరలేదు. వాళ్ల కబ్జా కోరల్లో వున్న భూములు తీసేసుకుంటే చాలు అన్నది ప్లాన్ గా చేసుకున్నారు. అదే అమలు చేస్తున్నారు.
ఇంతకీ ఇది మంచిదేనా? కాదా? ఎవరైనా ఓ యాంగిల్ లో మంచిదే అంటారు. ఏ యాంగిల్? ప్రభుత్వ భూములు సంరక్షించడం అనే యాంగిల్. కానీ ఇక్కడ ఇంకో యాంగిల్ కూడా కనిపిస్తోంది. రాజకీయ నాయకులు…రాజకీయ నాయకులు మిలాఖత్ అయిపోకుండా, సరే వంద ఎకరాలు కబ్జాలో వున్నాయి అని తెలుసు కానీ, ఓ పాతిక ఇచ్చి మిగితావి వుంచేసుకో అనే డీల్ కు దిగడం లేదు. ఇది మంచి యాంగిల్.
ఎలా అంటే, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు కదా, ఇప్పుడు వైకాపా వుంటే మరోసారి తేదేపా వుంటుంది. ఓసారి తేదేపా వుంటే మరోసారి వైకాపా వుంటుంది. ''',.,..తాతకు నీవు చేసిన మర్యాద రేపు నీకు నేను చేయాలి అని కొడుకు తండ్రితో అన్నట్లు వుంటుంది వ్యవహారం…'' ఇవ్వాళ తేదేపా జనాల కబ్జాలు వైకాపా బయటకు తీస్తే రేపు తేదేపా అధికారంలోకి వచ్చాక, ఇలాంటివి వైకాపా వాళ్లు ఎక్కడ చేసారు అని దుర్భిణీ వేసి చూస్తుంది. మళ్లీ ఇదే చక్రం ఇలా తిరుగుతూ వుంటుంది.
అప్పుడేమవుతుంది..దొంగ..దొంగ కొట్టుకుంటే పాత దొంగతనాల వైనాలు అన్నీ బయటకు వచ్చినట్లు, రాజకీయ నాయకులను రాజకీయ నాయకులే టార్గెట్ చేస్తే ఇలాంటి భూ బాగోతాలు అన్నీ బయటకు వస్తుంటాయి. మంచిదేగా? నిజానికి ఇలాగే వుండాలి. ప్రభుత్వాలు మారుతూ వుండాలి. కబ్జాలను బయటకు పీకుతూ వుండాలి. జనం కళ్ల ముందు రాజకీయ నాయకుల నగ్న స్వరూపం నిలబడుతూ వుండాలి. అంతే కానీ నీకు ఇంత..నాకు ఇంత అంటూ ల్యాండ్ ఓనర్-డెవలపర్ ల మాదిరిగా షేర్ చేసేసుకంటూ పోతే, ఈ భూమ్మీద ప్రభుత్వ భూమి అన్నది మిగిలదు. ఈ కబ్జాకాండ అనే కాదు, మరే స్కామ్ అయినా సరే రాజకీయ పక్షాలు బయటకు పీకుతూనే వుండాలి. అప్పుడే రాజకీయ నాయకులు కాస్తయినా ఒళ్లు దగ్గర పెట్టుకుని వుంటారు. లేదూ అంటే ప్రభుత్వం ఎవరిదైతేనేం..మనం మేనేజ్ చేసేస్తాంగా అని ధీమా పడిపోతారు. ఇప్పుడు ఆ ధీమాకు జగన్ గండి కొట్టేసాడు. రేపు చంద్రబాబు వచ్చినా ఈ గండి పూడ్చకుండా వుంటే చాలు.
చాణక్య