ప్రాచీన భాష తెలుగు. తేనెలొలికే తెలుగు. తెలుగు వాడిగా పుట్టడమే అదృష్టం అని అంతా అంటారు. అటువంటి తెలుగు భాషకు కేంద్రం అయిన అధికార భాషా సంఘం కార్యాలయం విశాఖకు తరలిరానుంది.
కొద్ది రోజుల వ్యవధిలోనే విశాఖలో ఆ ఆఫీస్ కొలువు తీరనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు.
అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విశాఖలోనే ఉంటారు. ఇపుడు ఆఫీస్ కూడా అక్కడికే రావడంతో రానున్న కాలంలో కార్యకలాపాలు మరింత ముమ్మరం అవుతాయని అంతా భావిస్తున్నారు.
విశాఖలోని కైలాసగిరి పైన తెలుగు మ్యూజియం కూడా ఉంది. దాంతో పాటు విశాఖలో తెలుగునకు మరింత కొత్త వెలుగులు తీసుకురావడానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది.
మొత్తానికి రాజధాని కంటే ముందే తెలుగు భాషా సంఘం ఆఫీస్ విశాఖకు రావడం శుభ పరిణామమే అని భాషావేత్తలతో పాటు మేధావులు కూడా అంటున్నారు.