వంగపండు ప్రసాదరావు అసలైన ప్రజాకవి. ఆయనలోని గొప్ప లక్షణమేంటంటే ఆయన తన పాటను తానే రాసుకుంటారు, పాడుతారు, తగినట్లుగా డ్యాన్స్ కూడా చేస్తారు. ఎక్కడైనా ఏ వేళలోనైనా ఆయన సులువుగా కాలికి గజ్జె కట్టి గళమెత్తి పాడేయగలరు, అప్పటికపుడు ఆసువుగా ప్రజా సమస్యల మీద పాట ఏర్చి కూర్చి జనం కన్నీటిని తుడవగలరు, తక్షణ ఓదార్పు ఇవ్వగలరు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్న కరోనా మహమ్మారి మీద కూడా పాట కట్టి పాడిన ఘనత వంగపండుదే. కరోనా ఏం నీ ఘరానా అంటూ గద్దించడమే కాదు, సామాజిక దూరంతో పాటు సబ్బు నురగల మధ్య నిన్ను తరిమేస్తామంటూ గర్జించి భయంతో వణుకుతున్న ప్రజలకు ధైర్యం చెప్పిన సిసలైన ప్రజా గాయకుడు వంగపండు అని చెప్పాలి.
ఇక ఉత్తరాంధ్రా బాగా వెనకబడిన ప్రాంతం అని అందరికీ తెలుసు. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం వంటి అత్యంత వెనకబడిన చోట పుట్టిన వంగపండు ఉత్తరాంధ్రా అభివ్రుధ్ధిని మనసారా కోరుకున్నారు. అందుకోసం తన కలాన్ని, గళాన్ని, పాదాన్ని జోడించి జీవిత కాలం పోరాటం చేశారు. పాలకులకు ఎన్నో సమస్యలు విన్నవించుకున్నారు.
విశాఖ రాష్ట్ర పాలనారాజధానిగా మారుతున్న తరుణంలో వంగపండు ఆశలు అన్నీ నెరవేరుతున్న వేళ ఆ ఆనందాన్ని కనులారా చూడకుండా వంగపండు కళ్ళు మూయడం ఉత్తరాంధ్రావాసులకు తీరని లోటే. ఏది ఏమైనా తన జీవితకాలంలో చేసిన అనేక పోరాటాలకు తగిన పరిష్కారం లభించిందన్న సంత్రుప్తితోనే ఆయన వెళ్ళిపోయారనుకోవాలి.