అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నాడని ఇది వరకే 'గ్రేట్ ఆంధ్ర' చెప్పింది. అనంతపురం జిల్లాలో కమ్మ సామాజికవర్గం నేతల చూపు బీజేపీ మీద ఉన్న వైనాన్ని వివరించింది. ఈ క్రమంలో వరదాపురం సూరి బీజేపీలోకి చేరడం ఖరారు అయ్యింది. ఈ విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా కూడా ప్రకటించేసింది. వరదాపురం సూరిని పార్టీ వీడకుండా నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు పలు ప్రయత్నాలు చేశారని, అయితే అవి ఫలించలేదని తెలుగుదేశం అనుకూల మీడియానే చెబుతూ ఉంది.
ఒకసారి ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు సూరి. అయితే ఐదేళ్లలో ఆయన అపారమైన ఆర్థికశక్తిని సంపాదించారు. అనంతపురం జిల్లా టీడీపీ నేతల్లో అత్యంత భారీగా సంపాదించిన వారిలో ఒకటీ, రెండు స్థానాల్లో ఒక స్థానం సూరికి దక్కుతుందని అంటారు. ఇతర అన్ని రూపాలతో పాటు కాంట్రాక్టుల ద్వారా కూడా వరదాపురం భారీగా సంపాదించాడనే పేరుంది. ప్రత్యేకించి రోడ్డు కాంట్రాక్టుల ద్వారా వందల కోట్ల రూపాయలకు ఇతడు పడగలెత్తాడని అంటారు.
ప్రస్తుతం అలాంటి కాంట్రాక్టులు చాలావరకూ నిర్మాణ దశలో ఉన్నాయి. వాటిల్లో నాణ్యత విషయంలో ఇప్పటికే బోలెడన్ని ఫిర్యాదులు వచ్చాయి. నాణ్యతా రాహితంగా రోడ్డు నిర్మాణాలు సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. అలాగే ప్రకృతి వనరులను దోచుకోవడంలో కూడా ఈయన ముందున్నారనే వార్తలు వస్తున్నాయి. కొండలనే పిండి చేస్తూ ఆ పరిసరాల వారిని భయభ్రాంతులను చేస్తున్న స్థాయిలో ఇతడి కంపెనీల మైనింగ్ సాగుతూ ఉంది.
అలాంటి అక్రమాలన్నింటి నుంచి రక్షణ పొందడానికి వరదాపురం సూరి భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నారని సామాన్య ప్రజానీకం అనుకుంటోంది. ఏదో విధంగా అధికార పార్టీలో ఉన్నట్టుగా అనిపించుకుంటే చాలు అన్ని అక్రమాల నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఏర్పడినట్టుంది. ఇలాంటి వారికి బీజేపీ ఘనస్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది!
ఇలాంటి వారు మళ్లీ ఎన్నికల నాటికి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరే వ్యూహంతోనే వెళుతున్నారనేది నిఖార్సైన నిజం. ఇక అనంతపురం జిల్లా నుంచినే మరింతమంది తెలుగుదేశం వాళ్లు బీజేపీలోకి చేరుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.