తొలిసారి పార్లమెంటుకు ఎంపికవుతూనే ప్రధాన మంత్రి అయ్యారు నరేంద్ర మోడీ. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంటు వద్దకు చేరుకుని, నేలపై మోకరిల్లి నమస్కారం చేశారు.. ప్రజాస్వామ్య దేవాలయానికి. చట్ట సభల్ని దేవాలయాలుగా రాజకీయ నాయకులు అభివర్ణిస్తుంటారు. రాజకీయ నాయకులు చెప్పే మాటలకీ, వారి చేతలకీ అస్సలు పొంతన వుండదు. చట్ట సభల్లోకి వెళ్ళడం అనేది వారికో గొప్ప అచీవ్మెంట్. కానీ, ఓసారి చట్టసభలకు వెళ్ళాక, ఆ చట్టసభల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న కనీసపాటి ఇంగితాన్ని విస్మరిస్తుంటారు.
చట్ట సభలంటే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడానికి ఓ వేదిక అనే భావన అటు అధికార పక్షాల్లోనూ, ఇటు విపక్షాల్లోనూ బలపడిపోయింది. అందుకే, రాష్ట్రాల స్థాయిలో అసెంబ్లీ, శాసన మండలి అయినా.. దేశ స్థాయిలో లోక్ సభ, రాజ్యసభ అయినా.. ఒకటే తీరు. సభలో కాలక్షేపం కోసం బూతు వీడియోలు చూసే స్థాయికి ప్రజా ప్రతినిథులు కొందరు దిగజారిపోయిన వైనం, మీడియాలో అప్పుడప్పుడూ తిలకిస్తున్నాం.
అలాంటివారిని శాశ్వతంగా చట్ట సభల్లోకి వెళ్ళకుండా చేయగలుగుతున్నామా.? చట్ట సభల్లో నిస్సిగ్గుగా కొట్టుకుంటున్నవారిని రాజకీయాల నుంచి తరిమికొడుతున్నమా.? లేదు, అది జరగనే జరగదు. రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తాజాగా రాజ్యసభలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు వ్యతిరేక చట్టలు, పెగాసస్ సహా పలు అంశాలపై పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తే.. విపక్షాలతోపాటు, దేశ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడికి పరిమితమయ్యారు. పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య గలాటా చోటు చేసుకుంది. రాజ్యసభలో ఇది ఇంకాస్త ముదిరి పాకాన పడిరది. పోడియం వద్దకు విపక్ష సభ్యులు దూసుకురావడం పట్ల రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య తీవ్రంగా మండిపడ్డారు.
అంతేనా, కంటతడి కూడా పెట్టేశారు. అంతగా కంట తడి పెట్టాల్సిన పనేముంది.? పద్ధతి తప్పిన సభ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఎటూ వుంది కదా.? ‘ఇదొక డ్రామా..’ అంటూ వెంకయ్యనాయుడిపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.. సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. నిజానికి, వెంకయ్యనాయుడికి ఇప్పుడు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. కానీ, ఆయన వ్యవహార శైలి బీజేపీకి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నట్లే వుందన్న భావన సర్వత్రా వ్యక్తమువుతోంది.
అసలు చట్ట సభల్లో సభ్యులెందుకు ఇలా హద్దులు దాటుతుంటారు.? అన్న ప్రశ్న గురించి ఆలోచిస్తే, చట్ట సభల్లోకి ఎలాంటివారిని రాజకీయ పార్టీలు పంపిస్తున్నాయన్న అంశం చుట్టూ చర్చ జరగాలి. విజయ్ మాల్యా లాంటి వ్యక్తిని చట్ట సభలకు పంపిన ఘనత మన రాజకీయ పార్టీలది. ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిథులు చట్ట సభలకు వెళ్ళడం అనేది ఓ యెత్తు.
రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం నేరుగా శాసన మండలి, రాజ్యసభ వంటి వాటికి నామినేట్ చేయడం ఇంకో యెత్తు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. సరే, ప్రజలెన్నుకున్న నాయకులైనా చట్ట సభల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా.? అంటే అదీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాల వేళ చోటు చేసుకుంటున్న దురదృష్టకర పరిణామాలే అందుకు నిదర్శనం.
ఓ మంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి మందలించాల్సి వచ్చింది.. సదరు మంత్రిగారు చట్ట సభలో బూతులు మాట్లాడినందుకు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పరిస్థితి మరీ దారుణం. టీడీపీ వైసీపీ మధ్య యాగీ.. అత్యంత జుగుప్సాకరం. ఎవరు అధికారంలో వున్నఆ ఒకటే తంతు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసన మండలిలో.
ఇక, వెంకయ్య ఆవేదన విషయానికొద్దాం. మన్మోహన్ సింగ్ ప్రధానిగా వున్న కాలంలో బీజేపీ చేసిందేంటి.? ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించేందుకోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పాస్ అయ్యే క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి.? వాటికన్నా ఇప్పుడు కొత్తగా పరిస్థితులు దిగజారాయని అనగలమా.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఓ హక్కుగా సంక్రమించింది రాజ్యసభ ద్వారానే. దాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొక్కిపెట్టింది.
అప్పట్లో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా రాజ్యసభ సాక్షిగా పట్టుబట్టింది ఎవరో కాదు వెంకయ్యనాయుడుగారే. ఆయనే ఇప్పుడు రాజ్యసభ ఛైర్మన్. రాజ్యసభకు ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత గౌరవం ఇస్తోందో వెంకయ్యనాయుడికంటే బాగా ఇంకెవరికి తెలుసు.? కొత్తగా చట్ట సభలనబడే ప్రజాస్వామ్య దేవాలయాలు అపవిత్రమైపోయాయని వెంకయ్య కంటతడి పెడితే.. దాన్ని నమ్మేదెలా.?