మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం చాలా జాప్యం తరువాత, అనేక అవాంతరాల మధ్య తెలంగాణా కాంగ్రెసును ఒక కొలిక్కి తెచ్చింది. వలస నాయకుడు రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ లో మంచి ఊపు వచ్చింది. జోష్ కనబడుతోంది. రాష్ట్రంలో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది.
గెలుస్తుందా లేదా అనే సంగతి పక్కన పెడితే తప్పనిసరిగా పోరాట పటిమ చూపిస్తుందని చెప్పొచ్చు. అధిష్టానానికి తెలంగాణా గురించిన టెంక్షన్ తీరిపోయింది. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్. దాన్ని ఎలా సంస్కరించాలనే దానిపై రాహుల్ గాంధీ దృష్టి పెట్టాడు. ఏపీ కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి అధ్యక్షుడు శైలజా నాథ్ ను మారుస్తారా ? ఆయన్ని అలాగే ఉంచి ఇంకేమైనా మార్పులు చేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
ఇప్పటికే పంజాబ్, తెలంగాణ, కర్నాటక, మహరాష్ట్ర, అస్సాం,కేరళ సహా పలు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఇప్పటికే, ఏపీకి చెందిన ముఖ్యనేతలతో చర్చలు జరిపిన రాహుల్ గాంధీ ఈ మధ్య మరోసారి కీలక నేతలతో భేటీ అయ్యాడు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు, దళిత నేతలు హర్షకుమార్, చింతమోహన్, జేడీ శీలంతో రాహుల్ చర్చించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ఏం చేయాలనే దానిపై ఆ పార్టీ హైకమాండ్ ఇప్పటికే సమాలోచనలు జరిపింది. దీనిపై ఓ సమగ్ర నివేదిక ఇవ్వాలని రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీని ఆదేశించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టులోనే ఏపీ కాంగ్రెస్‌లో సమూల ప్రక్షాళన జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
అయితే, ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను మార్చి.. ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారా లేక ఆయనను కొనసాగిస్తూనే మిగతా ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగిస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది. ఈమధ్యనే ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కే.సి. వేణుగోపాల్ తో సమావేశమై, విపులంగా చర్చించిన ఏపి ఇంచార్జ్ ఉమన్ చాందీ, ఇంచార్జ్ ఏఐసిసి సెక్రటరీలు క్రిస్టోఫర్, మయప్పన్… ఆ తర్వాత రాహుల్ గాంధీతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించి, నివేదికను కూడా అందజేసారు.
కే.సి. వేణుగోపాల్, ఏపి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఉమన్ చాందీ ఇంచార్జ్ ఏఐసిసి సెక్రటరీలు క్రిస్టోఫర్, మయప్పన్…. ఏపిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు కొన్ని సూచనలతో కూడిన కార్యాచరణ ను రాహుల్ గాంధీ కి అందజేశారు. ఉమన్ చాందీ, అవసరాన్ని బట్టి మరికొంతమంది ఏపి రాష్ట్ర నేతలను కూడా రాహుల్ గాంధీ విడిగా కలిసే అవకాశం ఉంది. ఈ కసరత్తంతా పూర్తయున తర్వాత సెప్టెంబర్ మొదటివారం లో కొంతమంది రాష్ట్ర నేతలకు పార్టీ పదవులు, బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. సెప్టెంబర్ నెలాఖరుకు రాహుల్ గాంధీ ఏపిలో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సాకే శైలజానాధ్ నేతృత్వంలో ఏపీ కాంగ్రెస్ నిర్లిప్తంగా కొనసాగుతోందన్న అభిప్రాయం ప్రజల్లోనూ, నాయకుల్లోనూ ఉంది. ఇంతకు ముందు పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించిన రఘువీరారెడ్డి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం సాకే శైలజానాధ్ వల్ల కాదన్న భావనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పీసీసీ చీఫ్ మార్పునకు కసరత్తు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి ? పార్టీకి పూర్వవైభవం తేవాలంటే ఏమి చేయాలి ? ఇపుడిదే కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహూల్ గాంధీకి అర్ధం కావటంలేదు. 2014లో రాష్ట్ర విభజనకు తీసుకున్న ఏకపక్ష నిర్ణయమే కాంగ్రెస్ పార్టీకి ఏపిలో ఘోరీ కట్టేసింది. అప్పట్లో తాము తీసుకుంటున్న నిర్ణయం తప్పని తెలిసినా సరే ఒత్తిడికి తలొగ్గి, ఏదేదో ఊహించుకుని రాష్ట్ర విభజన చేసేసింది యూపీఏ ప్రభుత్వం.
అప్పట్లో చేసిన అడ్డుగోలు విభజనకు పూర్తి బాధ్యత సోనియాగాంధి, రాహూల్ గాంధీదే. దాని పర్యవసానంగానే ఇటు తెలంగాణాలోను అటు ఏపిలో కూడా పార్టీ దెబ్బతినేసింది. తెలంగాణాలో అయినా పార్టీ అంతో ఇంతో మిగిలుంది కానీ ఏపిలో అయితే పదడుగుల లోతు గొయ్యి తవ్వి జనాలు పార్టీని పాతిపెట్టేశారు. అధికారపార్టీగా కళకళలాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా నిలువునా కుప్పకూలింది. విభజన తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన అభ్యర్ధుల్లో ఒక్కరు కూడా గెలవలేదు. అసలు 99 శాతం మంది అభ్యర్ధులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.
సాధారణ ఎన్నికలే కాదు కనీసం స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయటానికి జనాలు ఇష్టపడటంలేదు. ఇదే పరిస్ధితి వచ్చే ఎన్నికల్లో కూడా రిటీటైనా ఆశ్చర్యంలేదు. రాహుల్ గాంధీతో సమావేశానికి వెళ్లిన వారిలో పళ్ళంరాజు తప్ప మిగిలిన ముగ్గురికి క్షేత్రస్ధాయిలో పట్టేలేదు. కిరణ్, చింతామోహన్ పార్టీ గాలుంటే గెలుస్తారు లేకపోతే లేదు. ఇక కేవీపీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది.
కేవీపీ తెరవెనుక మంత్రాంగానికి మాత్రమే పనికొస్తారు. మరి పార్టీలో బలమున్న నేతలను వదిలేసి వీళ్ళతోనే రాహూల్ ఎందుకు సమావేశం అయ్యారు ? ఎందుకంటే క్షేత్రస్ధాయిలో బలమున్న నేతల్లో చాలామంది ఇప్పటికే పార్టీని వదిలేశారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీలోని చాలామంది వైసీపీలో మరికొందరు టీడీపీలో చేరిపోయారు. ఇతర పార్టీల్లో చేరలేని నేతలు, జనాల్లో పెద్దగా పలుకుబడి లేని నేతలు మాత్రమే కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి గత వైభవం తేవాలంటున్నారు కాంగ్రెస్ నాయకులు. కానీ ఆ వైభవం తేవడం సాధ్యమా ? ఒకసారి దాని వైభవం ఏమిటో లుక్కేద్దాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్న పేరు ఉండేది. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో దేశమంతా ఓటర్లు కాంగ్రెస్‌పై కన్నెర్ర చేస్తే, తెలుగు ప్రజలు మాత్రం ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. అలా దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించి, ఎంతో ప్రజాదరణ పొందిన ఆ పార్టీ నేడు రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడమే కష్టంగా మారుతోంది.
ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన 1955 ఎన్నికల్లో కమ్యూనిస్టులకు భారీ మెజార్టీ వస్తుందని అంతా భావించారు. కానీ, ఆ అంచనాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అప్పుడు అసెంబ్లీలో మొత్తం 196 స్థానాలు ఉండగా, 142 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 119 సీట్లు సాధించింది. 169 స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ 15 సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత రెండేళ్లకు (1957లో) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంత అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 105 స్థానాలకు జరిగిన ఆ ఎన్నికల్లో 68 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
అలా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు దశాబ్దాల పాటు ఆ పార్టీ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1975-77 మధ్య దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దానిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం పూర్తి భిన్నమైన తీర్పు ఇచ్చారు.
రాష్ట్రంలోని మొత్తం 42 పార్లమెంట్ స్థానాల్లో 41 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంతేకాదు, 1978లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దేశమంతా ఇందిరను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ను ఓడిస్తే, తెలుగు ప్రజలు మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఆ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను, 290 చోట్ల కాంగ్రెస్ (ఇందిర కాంగ్రెస్) బరిలో నిలవగా 175 స్థానాలు గెలుచుకుంది. అలాగే, 1980లో జరిగిన ఎన్నికల్లోనూ ఇందిరకు బహుమానం ఇచ్చారు.
ఆ ఎన్నికల్లో ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలీతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ (ప్రస్తుతం తెలంగాణలో ఉంది) లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేశారు. రాయబరేలీలో ఆమెకు కేవలం ఏడు వేల ఓట్ల మెజార్టీ రాగా, మెదక్‌లో 2 లక్షలకు పైగా ఆధిక్యం వచ్చింది. ఇందిర రాయ్‌బరేలీని వదులుకుని మెదక్ నుంచే ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ ఎంపీల్లో ఇప్పటి వరకు అత్యధిక మెజార్టీ సాధించింది కూడా తెలుగు వ్యక్తే.
నంద్యాల లోక్‌సభ స్థానానికి 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు 5.8 లక్షల మెజార్టీతో అఖండ విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగు నేలపై ఎంతటి క్రేజ్ ఉండేదో చెప్పేందుకు ఆ ఫలితాలు చక్కని ఉదాహరణలు. రాష్ట్ర విభజన అంశం సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బ కొట్టింది. మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఘోరమైన పరాభవాన్ని 2014 ఎన్నికల్లో ఆ పార్టీ చవిచూసింది.
నవ్యాంధ్ర రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా సాధించకపోగా, 150 పైగా అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. 2019 ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఎన్టీఆర్ ప్రభంజనం సమయంలోనూ కాంగ్రెస్‌కు ఇంతటి గడ్డు పరిస్థితి ఏర్పడలేదు.
-నాగ్ మేడేపల్లి