అంగట్లో బేరం పెట్టినట్లుగా అధికారికంగా ప్రకటనలు అయితే లేవు కానీ తెర వెనక చాలానే కధ సాగిపోతోంది అనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరిస్తామని కేంద్ర పెద్దలు అంటున్నారు మరి ఆ దిశగా బయటకు ఏమీ జరుగుతున్నట్లుగా తెలియడంలేదు కానీ లోపల మాత్రం బేరాలు, రాయబారాలు యమ జోరుగా సాగిపోతున్నాయి.
నిన్నటికి నిన్న టాటా స్టీల్ యాజమాన్యం విశాఖ స్టీల్ ని తాము కొంటామంటూ ఆసక్తిని వ్యక్తం చేసింది. తీర ప్రాంతంలోని స్టీల్ ప్లాంట్ అయితే తమకు లాభసాటి అని కూడా ఆ సంస్థ సీఈఓ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇపుడు గుజరాత్ కి చెందిన మిట్టల్ గ్రూప్ వారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని తామే కొనుగోలు చేస్తామని అంటున్నారు.
బిడ్డింగ్ లో పాలుపంచుకుంటామని కూడా గట్టిగానే చెబుతున్నారు. ఆంధ్రా ఒడిషా మధ్యన అద్భుతంగా స్టీల్ ప్లాంట్ విస్తరణ చేయవచ్చు అని కూడా తమ వ్యూహాలను బయటపెడుతున్నారు. మరి దీనిని బట్టి చూస్తూంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పెళ్ళి కొడుకులు చాలా మందే ఉన్నారు. ఎవరు తాళి కడతారు అన్నది కేంద్రం ఇష్టంగానే చూడాలి. ఎవరికి విశాఖ స్టీల్ ని దారాదత్తం చేయాలని కేంద్ర పెద్దలు భావిస్తే వారిదే విశాఖ ప్లాంట్ అవుతుంది.
ఇవన్నీ ఇలా ఉంటే ఈ నెల 29న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పది వేల మంది దాకా మానవహారంగా ఏర్పడి ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెబుతున్నారు. ఒక వైపు ఉద్యమం సాగుతున్నా మరో వైపు మాత్రం ఎక్కడా తగ్గేది లేదు అంటోంది కేంద్రం. చూడాలి వరమాలతో ఏ పెళ్ళి కొడుకు విశాఖ ప్లాంట్ మెడలో తాళి కట్టి సొంతం చేసుకుంటాడో.