లక్షల్లో బకాయి పడ్డ టీడీపీ…?

అవును ఇది నిజమే. తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున బకాయి పడింది. అణా పైసలతో సహా దాన్ని లెక్క కట్టి మరీ విశాఖ నగర పాలక సంస్థ జప్తు నోటీసుని తెచ్చి మరీ విశాఖలోని…

అవును ఇది నిజమే. తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున బకాయి పడింది. అణా పైసలతో సహా దాన్ని లెక్క కట్టి మరీ విశాఖ నగర పాలక సంస్థ జప్తు నోటీసుని తెచ్చి మరీ విశాఖలోని ఆ పార్టీ ఆఫీస్ కి అతికించేసింది.

టీడీపీ అంటే చిన్న పార్టీ కాదు, నాలుగు దశాబ్దాలు హిస్టరీ. రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న రికార్డు కలిగిన పార్టీ. విశాఖ వంటి మెగా సిటీలో అద్భుతమైన భవనాన్ని కట్టుకుని మరీ పార్టీ యాక్టివిటీస్ ని నిర్వహిస్తున్న టీడీపీ ఎందుకు బకాయి పడింది అంటే జీవీఎంసీకి కట్టాల్సిన ఆస్తిపన్నుసరిగ్గా కట్టలేదని అంటున్నారు.

ఆ మొత్తం అలా పెరిగి ఈ రోజుకు అక్షరాలా నాలుగు లక్షల అరవై ఆరు వేల దాకా బాకీ ఉందని లెక్క తేల్చారు. దీంతో జోన్ ఫోర్ రెవిన్యూ అధికారులు టీడీపీ ఆఫీస్ బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని అంటున్నారు. విశాఖలోని 28వ వార్డులో ఉన్న టీడీపీ భవనానినికి జప్తు నోటీసులు అంటించి తక్షణం బకాయి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఒక వేళ బకాయి కనుక చెల్లించకపోతే ఇరవై నాలుగు గంటలలో తదుపరి చర్యలు ఉంటాయని కూడా జోనల్ అసిస్టెంట్ కమిషనర్ రాజ్యలక్ష్మి హెచ్చరించారు. మొత్తానికి జప్తు నోటీసులతో పసుపు భవనం ఇపుడు కలవరపడుతోంది. 

మరి ఈ మొత్తాన్ని చెల్లిస్తారా లేక కోర్టుకు వెళ్తారా. లేక గడువు కోరుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా టీడీపీ ఆఫీసునకు జప్తు నోటీసులు అన్నది మాత్రం వైరల్ అవుతోంది.