బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ట్విటర్ వేదికగా బాబును టార్గెట్ చేస్తూ…చేసిన ట్వీట్ టీడీపీ శ్రేణులు తలదించుకునేలా ఉంది. మరి బాబుకు అలాంటి ఫీలింగ్ ఉందో లేదో తెలియదు. టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ నేతల అక్కసుకు నిదర్శనంగా చెప్పుకోవాల్సిన సందర్భం ఇది.
ప్రధాని మోడీని అదే పనిగా చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తినా ప్రయోజనం కనిపించడం లేదు. తాజాగా ప్రధానికి బాబు లేఖ రాస్తూ…పొగడ్తలతో ఆకాశమే హద్దుగా బాబు చెలరేగిపోయారు. సహజంగా తమ పార్టీ అగ్రనేత, ప్రధాని అయిన మోడీని ప్రశంసిస్తే బీజేపీ నేతలు ఏం చేయాలి…శభాష్ అని ప్రతిగా ప్రశంసించాలి.
నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని అంటారు కదా. ఆ పాటి మర్యాద కూడా మన బాబుపై బీజేపీ నేతలు పాటించరా? ఇదేనా భారతీయ, హిందూ సంప్రదాయానికి ప్రతీకగా చెప్పుకునే బీజేపీ నేతల మర్యాద? ఇలాగైతే మోడీ, అమిత్‌షాలను ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలో బీజేపీ నేతలే చెబితే…ఆ ప్రకారం చేస్తారు కదా! మరీ ఈ స్థాయిలో తిట్టి అవమానించడం దేనికి? అని టీడీపీ నేతలు ఆవేదనతో, ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు.
ప్రధాని మోడీకి బాబు లేఖ రాయడం…చివరికి ఆయనకు తిట్లు తీసుకొచ్చాయి. ఏపీలో పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయని, దానిపై విచారణ చేయాలంటూ ప్రధాని మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం లేఖ రాశారు. ఇప్పుడీ లేఖ బాబుపైకి రివర్స్ అయింది. చంద్రబాబుపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలో మోడీపై బాబు తీవ్రస్థాయిలో చేసిన విమర్శలు, వాటి పేపర్ క్లిప్పింగ్స్‌ను ట్విటర్లో షేర్ చేశారు.
ఈ సందర్భంగా విష్ణు తనదైన స్టైల్లో బాబుపై ధ్వజమెత్తారు. “నీకు కుటుంబం, బంధాలు లేవు. మా హక్కులు కాలరాశారు. మా అభివృద్ధిని ఓర్వేకపోతున్నారు. నీ కంటే నేను ముందే సీఎం అయ్యాను. గుజరాత్‌ని ఏం అభివృద్ధి చేసావు? మీ రాష్ట్రం కంటే దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి? మీకు మేము బానిసలం కాదు. మీరు పబ్లిసిటీ పీఎం. మీరు పనిచేసే పీఎం కాదు. మాకు పనిచేసే పీఎం కావాలి” ఇవన్నీ సందర్భానుసారంగా 2018 మార్చి నుంచి 2019 ఏప్రిల్ మధ్య నాడు మీరు మాట్లాడిన మాటలు బాబు గారు. గుర్తు ఉందా?’’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై చంద్రబాబు చేసిన దిగజారుడు విమర్శ లను ప్రజలు మర్చిపోలేదంటూ ఘాటుగా స్పందించారు.
స్వప్రయోజనాల కోసం అమరావతిని, రైతులను రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి రాజకీయ బలిపీఠం ఎక్కించిన విషయంలో బాబు చరిత్రలో నిలిచిపోతారంటూ విష్ణు ఘాటు విమర్శలు చేశారు. తాజా లేఖలో మోడీకి బాబు భజన చేయడంపై విష్ణు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకీ మార్పు? అంటూ ఆయన ప్రశ్నించారు.
గతంలో ఇష్టమొచ్చినట్టు మోడీని, బీజేపీని తూలనాడారని, వాటి గురించి మరిచిపోయేంత మతిమరుపు మోడీకి, బీజేపీకి లేవన్న విషయాన్ని విష్ణు గుర్తు చేశారు. అవసరాన్ని బట్టి భజన చేయడం మీకు మామూలే అంటూ బాబును దెప్పి పొడిచారు. ఈ మేరకు క్షమించాలని రాష్ట్ర , దేశ ప్రజలను కోరాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీని అంతలా పొగిడినా బీజేపీ తిట్ల దండకానికి దిగడం టీడీపీని ఆందోళనకు గురి చేస్తోంది. “ఛీఛీ…మా నాయకుడిని బీజేపీ ఇంత నీచంగా తిడుతుంటే మాకే సిగ్గేస్తోంది. మరీ ఇంత సిగ్గులేని బతుకేందబ్బా మా నాయకుడికి’’ అని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మోడీని ప్రసన్నం చేసుకోకపోతే ఏమవుతుందని ఆక్రోశంగా ప్రశ్నిస్తున్నారు.