మీడియా సంస్థల మధ్య మాటల యుద్ధం

టీవీ5 న్యూస్ ఛానెల్ నుంచి ఏకంగా 11 మంది కెమెరామెన్లను తీసేస్తున్నారంటూ వార్తలు వచ్చిన గంటల వ్యవధిలోనే.. ఎన్టీవీ ఛానెల్ అధినేతను ఆకాశానికెత్తేస్తూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కరోనా క్రైసిస్…

టీవీ5 న్యూస్ ఛానెల్ నుంచి ఏకంగా 11 మంది కెమెరామెన్లను తీసేస్తున్నారంటూ వార్తలు వచ్చిన గంటల వ్యవధిలోనే.. ఎన్టీవీ ఛానెల్ అధినేతను ఆకాశానికెత్తేస్తూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కరోనా క్రైసిస్ రోజుల్లో కూడా సదరు న్యూస్ ఛానెల్ యాజమాన్యం తమ ఉద్యోగులకు ఫుల్ శాలరీస్ ఇస్తోందని, జీతాల్లో కోతపెట్టబోమంటూ వాగ్దానం చేసిందనేది ఆ వార్త సారాంశం. దీంతో ఉద్యోగుల్ని తొలగిస్తున్న టీవీ5 ఛానెల్ పై విపరీతమైన ఒత్తిడి పడింది.

పక్క ఛానెల్ తో పోలుస్తూ.. ఉద్యోగాలు తీసేస్తున్నారంటూ రోడ్డెక్కడానికి కెమెరామెన్లు రెడీ అవుతున్నారు. కరోనా విపత్తు కష్టకాలంలో ఉద్యోగాలు తీసేస్తే.. తాము రోడ్డున పడతామంటూ బాధపడుతున్నారు. కేవలం ఉద్యోగులే కాదు.. ఇప్పుడు మీడియా యాజమాన్యాల మధ్య కూడా మాటల యుద్ధం మొదలైంది. ఒక దశలో ఒకరిపై ఒకరు నెగెటివ్ వార్తలకు కూడా సిద్ధమయ్యారు కానీ, తమ పరువు తామే బజారున పడేసుకోవడం ఇష్టంలేక వెనక్కు తగ్గారు.

వాస్తవానికి ఏపీలో అధికార మార్పిడి జరగడంతో.. అప్పటివరకూ ప్రభుత్వ సొమ్ముని ఫలహారం చేసిన కొన్ని మీడియా సంస్థల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయి. ఐదేళ్లు వ్యవహారం నడపడం కష్టం అనుకుంటున్న వేళ, కరోనా కాటు వీరికి కలిసొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకే జీతాల్లో కోత పెడుతున్న సందర్భాల్లో.. తాము ఏకంగా ఉద్యోగాల్లో నుంచి తీసేసినా అడిగేవారు ఉండరనే ఉద్దేశంతోటే మీడియా యాజమాన్యాలు ధైర్యం చేశాయి.

ఎలక్ట్రానిక్ మీడియానే కాదు, ప్రింట్ మీడియాలో కూడా ఈ పరిస్థితి అనివార్యమైంది. ఈనాడు వార్తాపత్రిక జిల్లా ఎడిషన్లు తగ్గించేసింది. కొన్ని జిల్లాల్లో పేజీలు కుదించేసింది. తద్వారా ప్రస్తుతానికి ఉద్యోగుల్ని ఇంటికే పరిమితం చేసింది. కరోనా సంక్షోభం తర్వాత తిరిగి వాళ్లను పిలుస్తుందో లేదో అనేది అనుమానం. అటు ఆంధ్రజ్యోతి కూడా 2 రాష్ట్రాలకు చెందిన సగం మంది సబ్-ఎడిటర్లను ఇంటికే పరిమితం చేసింది. కేవలం 25శాతం జీతాలిచ్చి చేతులు దులుపుకుంది. కరోనా క్రైసిస్ తర్వాత తిరిగి పిలుస్తుందో లేదో అనుమానం. ఈ నేపథ్యంలో టీవీ5 యాజమాన్యం ఏకంగా ఒకేసారి 11 మంది కెమెరామెన్లను తొలిగించడం వివాదాస్పదమైంది.

ప్రింట్ మీడియా అంతా ఉద్యోగుల్ని వదిలించుకోవడానికే సిద్ధమవ్వగా… (మీడియాపై కరోనా దెబ్బ పేరిట ఇంతకుముందు గ్రేట్ ఆంధ్రలో కథనం ఇచ్చాం) ఎలక్ట్రానిక్ మీడియాలో మాత్రం ఇలా 2 గ్రూపులు తయారయ్యాయి. మేం అండగా ఉంటాం అనే ఛానెళ్లు కొన్నయితే, ఉద్యోగుల్ని వదిలించుకునే ఛానెళ్లు మరికొన్ని. ఏబీఎన్, టీవీ5 ఛానెళ్లలో కోతలు ఉండబోతున్నాయి. అటు టీవీ9, ఎన్టీవీ యాజమాన్యాలు ఉద్యోగులకు భరోసా ఇస్తున్నాయి. ఉద్యోగాలు పోతాయనే అనుమానాలు ఏ కోశానా పెట్టుకోవద్దంటూ నిన్ననే టీవీ9 ఛానెల్ అంతర్గతంగా తమ ఎంప్లాయీస్ కు సందేశం ఇచ్చింది.

ఈ నేపథ్యంలో.. ఉద్యోగుల్ని వాడుకుని వదిలేసే మీడియా.. ఉద్యోగుల్ని కుటుంబ సభ్యుల్లా చూసుకునే మీడియా.. అంటూ రెండు వర్గాలు బయలుదేరాయి. దీంతో సోషల్ మీడియాలో మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అయితే ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా లేక.. శృతి మించి పాకాన పడుతుందా వేచి చూడాలి. మొత్తానికి కరోనా మహమ్మారి మీడియాను గట్టిగానే దెబ్బకొట్టింది.

ఆ డాక్ట‌ర్ పెద్ద‌త‌ప్పు చేశాడు క్ష‌మాప‌ణ చెప్పాలి